బీఆర్ఎస్‌కు షాక్.. మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరిన నల్లాల ఓదేలు దంపతులు..
చెన్నూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. బీఆర్ఎస్‌కు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

చెన్నూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. బీఆర్ఎస్‌కు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. నల్లాల ఓదేలుతో పాటు ఆయన సతీమణి, మంచిర్యాల జెడ్పీ చైర్ పర్సన్ భాగ్యలక్ష్మి, వారి అనుచరులు హస్తం కండువా కప్పుకున్నారు. హైదరాబాద్‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ, ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది.
ఇక, నల్లాల ఓదేలు విషయానికి వస్తే.. టీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచి 2009 సాధారణ ఎన్నికల్లో, 2010 ఉప ఎన్నికల్లో, 2014 సాధారణ ఎన్నికల్లో మూడుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. అయితే 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అధిష్టానం ఓదేలుకు టికెట్ నిరాకరించి బాల్క సుమన్‌కు సీటు ఇచ్చింది. అప్పటి నుంచి నల్లాల ఓదేలు అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన బీఆర్ఎస్ అధిష్టానం.. ఓదేలును బజ్జగించింది. కోటపల్లి నుంచి జెడ్పీటీసీగా గెలుపొందిన ఓదేలు సతీమణి భాగ్యలక్ష్మికి మంచిర్యాల జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ పదవి దక్కింది. అయితే అయినప్పటికీ తమకు పార్టీలో సముచిత స్థానం లేదని, పార్టీ కార్యక్రమాలకు దూరం పెడుతున్నారని.. ప్రభుత్వ కార్యక్రమాల్లో సైతం ప్రోటోకాల్ పాటించడం లేదని ఓదేలు దంపతులు ఆరోపిస్తున్నారు. బాల్క సుమన్ కావాలనే తమను అవమానపరుస్తున్నారని విమర్శలకు కూడా దిగారు.
ఈ క్రమంలోనే గతేడాది మే నెలలో ఓదేలు దంపతులు ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ సమక్షంలో హస్తం గూటికి చేరారు. అయితే నియోజకవర్గంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొవాల్సి వస్తుందని భావించిన బాల్క సుమన్.. తెర వెనక చక్రం తిప్పారు. ఈ క్రమంలోనే ఐదు నెలలు కూడా గడవకముందే.. 2022 అక్టోబర్‌లో హైదరాబాద్‌లో ఐటీ శాఖ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఓదెలు దంపతులు మళ్లీ గులాబీ గూటికి చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలను జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. అయితే ఇప్పుడు మళ్లీ ఓదేలు దంపతులు కాంగ్రెస్ గూటికి చేరడం.. అందుకే ఆ పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారంది.