బీజేపీకి కటుకం మృత్యుంజయం గుడ్‌బై.. పార్టీలో వుండలేనంటూ ఆవేదన
మాజీ ఎమ్మెల్యే కటుకం మృత్యుంజయం బీజేపీకి రాజీనామా చేశారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్ధితులు, బీజేపీ, అధికార పార్టీ మధ్య సంబంధాలు పరిశీలించిన అనంతరం ఇకపై పార్టీలో కొనసాగలేనని మృత్యుంజయం స్పష్టం చేశారు.

సీనియర్ నాయకుడు, కరీంనగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ మాజీ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే కటుకం మృత్యుంజయం బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను శుక్రవారం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జీ .కిషన్ రెడ్డికి పంపించారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్ధితులు, బీజేపీ, అధికార పార్టీ మధ్య సంబంధాలు పరిశీలించిన అనంతరం ఇకపై పార్టీలో కొనసాగలేనని మృత్యుంజయం స్పష్టం చేశారు. అందుకే బీజేపీ నుంచి వైదోలుగుతున్నట్లుగా ఆయన పేర్కొన్నారు.
కాగా.. 1981లో రాజకీయాల్లోకి వచ్చిన కటుకం మృత్యుంజయం తొలుత గంభీరావుపేట్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడిగా పనిచేశాడు. 1983 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనర్ నియోజకవర్గం నుంచి సంజయ్ విచార్ మంచ్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆపై కాంగ్రెస్ పార్టీలో చేరి 1992 నుంచి 1995 వరకు గంభీరావుపేట సింగిల్ విండో ఛైర్మన్‌గా పనిచేశారు. తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్ర సహకర బ్యాంక్ ఛైర్మన్‌గానూ సేవలందించారు. అయితే 2020 మార్చిలో డీసీసీ అధ్యక్ష పదవికి, కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేసి అదే ఏడాది జూన్‌లో బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు.