హైదరాబాద్.:తెలంగాణలో పార్టీ పెట్టాలని సన్నాహాలు చేసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిలపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ కుటుంబంలో చోటు చేసుకున్న తగాదాల కారణంగానే వైఎస్ షర్మిల పార్టీ పెడుతున్నారని ఆయన అన్నారు. బుధవారంనాడు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. 

షర్మిలకు వైఎస్ జగన్ లోకసభ సీటు గానీ రాజ్యసభ సీటు గానీ ఇవ్వలేదని ఆయన చెప్పారు. కుటుంబంలో ఆస్తి తగాదాలు కూడా ఉన్నాయని ఆయన అన్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం బాటలోనే షర్మిల పార్టీ నడుస్తుందని ఆయన అన్నారు. 

గతంలో చిరంజీవి పార్టీ వల్ల అమాయకులు బలయ్యారని, చాలా మంది భూములు అ్మి సర్వం కోల్పోయారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు షర్మిల పార్టీ కూడా అదే దారిలో నడుస్తోందని అన్నారు. ఇలా పార్టీలు పెట్టి ఇతరులను ముంచవద్దని ఆయన షర్మిలకు సలహా ఇచ్చారు. 

వైఎస్ విజయలక్ష్మి ఆశీస్సులు షర్మిలకు ఉన్నాయని ఆయన చెప్పారు. అందుకే విజయమ్మ అందరికీ ఫోన్లు చేస్తున్నారని ఆయన చెప్పారు. తెలంగాణలో పార్టీ పెట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిష్టను దెబ్బ తీయవద్దని ఆయన సలహా ఇచ్చారు. 

కాగా, ఏప్రిల్ 9వ తేదీన వైఎస్ షర్మిల తన తెలంగాణ పార్టీని ప్రకటిస్తారని ప్రచారం సాగుతోంది. ఖమ్మం పర్యటనలో ఆమె పార్టీ గురించి ప్రకటన చేస్తారని అంటున్నారు. హైదరాబాదు నుంచి ఆమె ఖమ్మం వెళ్లే దారిలో ప్రజలకు అభివాదం చేస్తారని అంటున్నారు.