సారాంశం

మాజీ మంత్రి, ఖమ్మం అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్ధి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం మొత్తాన్ని పక్కకుబెట్టి ఖమ్మం, పాలేరులలో కాంగ్రెస్‌ను ఓడించాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని తుమ్మల ఆరోపించారు.

మాజీ మంత్రి, ఖమ్మం అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్ధి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నగరంలోని ఎస్ఆర్ కన్వెన్షన్‌లో తెలుగుదేశం పార్టీ నేతలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తనకు ఎన్టీఆర్ రాజకీయ జన్మ ఇచ్చారని గుర్తుచేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఎన్ని అవమానాలు ఎదురైనా టీడీపీలోనే వున్నానని తుమ్మల వెల్లడించారు. గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలనేది తన ఆశయమన్నారు. చిన్న వయసులోనే ఎన్టీఆర్ తనకు అవకాశం ఇచ్చారని.. పదవులు అవసరం లేదని, జిల్లా అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌‌ తరపున బరిలో నిలిచానని తుమ్మల వెల్లడించారు. 

Also Read: మంత్రి పువ్వాడపై రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశాను.. తుమ్మల నాగేశ్వరరావు

తాను కష్టపడ్డ పార్టీ తనను ఓడించిందని అందుకే బీఆర్ఎస్‌లో వుండకూడదని బయటకు వచ్చానని నాగేశ్వరరావు చెప్పారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రం మొత్తాన్ని పక్కకుబెట్టి ఖమ్మం, పాలేరులలో కాంగ్రెస్‌ను ఓడించాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని తుమ్మల ఆరోపించారు. అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయని ఆయన అభివర్ణించారు. తనకు మద్ధతుగా నిలిచిన టీడీపీ శ్రేణులకు తుమ్మల నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు.