Asianet News TeluguAsianet News Telugu

కాళేశ్వరం ప్రారంభోత్సవం: కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ హరీశ్ ట్వీట్

హరీశ్ రావు ట్వీట్టర్‌ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను తెలంగాణ ప్రజల పోరాట ఫలితంగా అభివర్ణించిన ఆయన... ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతర కృషి వల్లే కాళేశ్వరం త్వరగా పూర్తయ్యిందని అభిప్రాయపడ్డారు. 

ex minister harish rao tweet on kcr over kaleshwaram opening
Author
Hyderabad, First Published Jun 21, 2019, 7:46 AM IST

తెలంగాణ జీవనాడిగా పేరొందిన కాళేశ్వరం ప్రాజెక్ట్ శుక్రవారం ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కన్నా ఎక్కువగా వినిపిస్తున్న పేరు హరీశ్ రావు. అప్పటి నీటిపారుదల శాఖ మంత్రిగా ఆయన కాళేశ్వరం పనులను పరుగులు పెట్టించారు.

ఎప్పటికప్పుడు అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్షలు చేసుకుంటూ ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయం చేశారు. ఈ క్రమంలో ప్రాజెక్ట్‌‌ ప్రారంభోత్సవానికి ఆయన వెళతారా...? హరీశ్‌కు ఆహ్వానం అందిందా లేదా అని తెలంగాణలో పెద్ద చర్చ జరుగుతోంది.

ఈ నేపథ్యంలో హరీశ్ రావు ట్వీట్టర్‌ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను తెలంగాణ ప్రజల పోరాట ఫలితంగా అభివర్ణించిన ఆయన... ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతర కృషి వల్లే కాళేశ్వరం త్వరగా పూర్తయ్యిందని అభిప్రాయపడ్డారు.

నాటి సమైక్య పాలకులు కావాలనే నీటి లభ్యత లేని చోట ప్రాజెక్ట్ కట్టడానికి ప్రయత్నిస్తే.. కేసీఆర్ అపర భగీరథుడిలా, ఒక ఇంజనీర్‌లా మారి ప్రాజెక్ట్‌ను రీడిజైన్ చేశారన్నారు. పొరుగు రాష్ట్రం మహారాష్ట్రతో నెలకొన్న వివాదాన్ని స్నేహపూర్వకంగా పరిష్కరించి ప్రాజెక్ట్‌ నిర్మాణానికి మార్గం సుగమం చేశారని హరీశ్ వ్యాఖ్యానించారు.

పనులను నిరంతరం పర్యవేక్షించి రికార్డు సమయంలో ప్రాజెక్ట్‌ను పూర్తి చేయించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. అలాగే ప్రాజెక్ట్ నిర్మాణంలో శ్రమించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలిపిన హరీశ్ రావు.. ప్రాజెక్ట్‌ ప్రారంభ సన్నివేశాన్ని తిలకించనున్న తెలంగాణ రైతుల పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios