కరీంనగర్: టీఆర్ఎస్ మాజీమంత్రి ఈటల రాజేందర్ నిప్పులు చెరిగారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో పాలక వర్గంతోపాటు వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఈటల అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

":నేను మెతక మనిషి అని, చూసి చూడనట్లు వదిలి పెడుతారులే అనుకుంటే ఇకపై చెల్లదు... ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇకపై మరో లెక్క.. ఉంటుందని గ్రహించి" పని చేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ హెచ్చరించారు.  

పట్టణ పరిధిలోని పంచముఖ హనుమాన్‌ ఆలయం, మోత్కులగూడెం, నాయిని చెరువు, దుర్గాకాలనీ, రాము హాస్పిటల్‌ ఏరియాలో ఈటల పర్యటించారు. ఇటీవల వేసిన రోడ్లు, డ్రైనేజీలు, పైపులైన్ల కోసం తవ్వగా ఏర్పడిన గుంతలు ఇలా ప్రతి చిన్న సమస్యను పరిశీలించారు. 

జమ్మికుంట పట్టణం పందులకు నిలయంగా మురికి కూపంగా మారిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటుచూసినా గుంతలమయమైన రోడ్లు, దెబ్బతిన్న డ్రైనేజీలు, పైపులైన్ల నిర్మాణం కోసం తీసిన గుంతలు, దుమ్ము, దూళితో పట్టణం అంతా అస్తవ్యస్తంగా తయారైందని ఇదేనా పద్దతి అంటూ విరుచుకుపడ్డారు. 

ఇటీవల వేసిన రోడ్లు కూడా పూర్తిగా దెబ్బ తిన్నాయంటే అధికారుల పర్యవేక్షణ లోపం కొట్టచ్చినట్లు కనిపిస్తోందని, అభివృద్ధి పనుల కోసం కేటాయించిన కోట్లాది రూపాయలు బుడిదలో పోసిన పన్నీరులా చేశారని కమిషనర్‌ ఎండీ అనిసూర్‌ రషీద్‌, ఏఈ రాజేందర్‌లపై తీవ్రంగా మండిపడ్డారు. 

హౌసింగ్‌ బోర్డులో ఉన్న ఖాళీ స్థలంలో పార్క్‌ నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేసి ఉన్నతాధికారులకు పంపించాలని సంబంధిత ఏఈ రవి ప్రకాష్‌ను ఈటల ఆదేశించారు. అయితే తమ నిబంధనలు ఒప్పుకోవు అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో ఆగ్రహానికి గురైన ఈటల హౌసింగ్‌బోర్డులో ఇండ్ల నిర్మాణాలు పోనూ మిగిలిన స్థలం వివరాలు అడుగడంతో సదరు అధికారి నీళ్లు నమిలారు. 

ప్రజలకు ఉప యోగపడే పనిచేయాలి తప్ప అక్కరకు రానివి కాదంటూ తెలంగాణ స్టేట్‌ హౌసింగ్‌ బోర్డు ప్రిన్సిపల్‌ సెక్రటరితో ఫోన్లో మాట్లాడి వివరించారు. పంచముఖ హనుమాన్‌ ఆలయం నుంచి ఆబాది జమ్మికుంట వరకు ఔటర్‌ రింగ్‌రోడ్డు నెక్లెస్‌ రోడ్డు తలపించేలా నిర్మిం చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.

ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. కొత్తగా రోడ్లు వేసే ముందు అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజి పైపులైన్‌ వేయడం మర్చిపోవదన్నారు. మున్సిపాలిటీలో ఉన్న రూ.40కోట్లతో జమ్మికుంట పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయ్యాలని ఆదేశించారు. పట్టణంలో చేపట్టాల్సిన ప్రధానమైన 18 పనులు త్వరలో ప్రారంభించాలన్నారు. 

తాను సూచించిన 18 పనులను నెలరోజుల్లో పూర్తి చెయ్యాలని త్వరగా టెంటర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. మున్సిపల్‌ ఏఈకి అనుభవం లేదని, డీఈ చూసుకోవాలన్నారు. 

ఈ సందర్భంగా పాలకవర్గానికి మున్సిపల్ కమిషనర్ లకు మధ్య నెలకొన్న అగాధంపై చర్చించారు. మున్సిపాల్టీలో ఖర్చు చేస్తున్న ప్రతి పైసా లెక్క పాలకవర్గానికి తెలపాల్సిన బాధ్యత కమిషనర్ కు ఉందని చెప్పి తీరాల్సిందేనన్నారు.