Asianet News TeluguAsianet News Telugu

ఎప్పుడూ ఏదో ఒక అడ్డంకి: ఎర్రబెల్లికి ఈ సారైనా దక్కేనా

ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ఈ దఫా  కేసీఆర్ కేబినెట్‌లో బెర్త్ దక్కే అవకాశం ఉందా అనే చర్చ సాగుతోంది. 

Errabelli dayakar rao never got minister post still now
Author
Warangal, First Published Dec 18, 2018, 4:41 PM IST


వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ఈ దఫా  కేసీఆర్ కేబినెట్‌లో బెర్త్ దక్కే అవకాశం ఉందా అనే చర్చ సాగుతోంది. దయాకర్ రావు టీడీపీలో ఉన్న సమయంలో సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు కేబినెట్ లో చోటు దక్కలేదు. కానీ ఈ దఫా దయాకర్ రావు‌కు కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం లేకపోలేదనే  అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

ఎర్రబెల్లి దయాకర్ రావు  జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే టీడీపీని వీడి టీఆర్ఎస్‌లో చేరారు. దయాకర్ రావు టీఆర్ఎస్‌లో చేరినా కూడ ఆయనకు కేసీఆర్ మంత్రివర్గంలో చోటు దక్కలేదు.తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు మాత్రమే  కేసీఆర్ మంత్రివర్గంలో చోటు దక్కింది.

ఈ దఫా కేసీఆర్  తనతో పాటు మహమూద్ అలీతో ప్రమాణం చేయించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో వరంగల్ జిల్లా నుండి  ఇతరులకు ఛాన్స్ దక్కినా దయాకర్ రావుకు  మంత్రి పదవి దక్కలేదు.

వరంగల్ జిల్లాలోని దాస్యం వినయ్ భాస్కర్ సోదరుడు ప్రణయ్ భాస్కర్‌కు ఎన్టీఆర్ మంత్రివర్గంలో యువజన సర్వీసుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఇదే జిల్లా నుండి  టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించిన కడియం శ్రీహరికి  చంద్రబాబునాయుడు కేబినెట్‌లో  చోటు లభించింది. భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా కడియం శ్రీహరి పనిచేశారు.

ఇదే జిల్లాకు చెందిన రేవూరి ప్రకాష్ రెడ్డికి కూడ కేబినెట్‌లో చోటు కల్పించాలని అప్పట్లో నిర్ణయం తీసుకొన్నారు. కానీ, రేవూరి ప్రకాష్ రెడ్డిని కేబినెట్‌లోకి తీసుకొనే ప్రతిపాదనను దయాకర్ రావు వ్యతిరేకించారని  ఆ సమయంలో ప్రచారంలో ఉంది. కానీ,  ఈ పరిస్థితుల నేపథ్యంలో రేవూరి ప్రకాష్ రెడ్డికి కేబినెట్ లో చోటు దక్కలేదు.

సామాజిక సమీకరణాల నేపథ్యంలో దయాకర్‌రావుకు బాబు మంత్రివర్గంలో చోటు లభించలేదు. ఇదిలా ఉంటే దయాకర్ రావు బాల్య మిత్రుడు, ఒకే గ్రామానికి చెందిన కడియం శ్రీహరికి మాత్రం బాబు కేబినెట్ లో బెర్త్ లభించింది.

రాజకీయ పరిస్థితులు మారాయి. 2014 ఎన్నికలకు ముందు టీడీపీ నుండి కడియం శ్రీహరి టీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు విడిపోయాయి. 2014 ఎన్నికల్లో వరంగల్ ఎంపీగా కడియం శ్రీహరి టీఆర్ఎస్ అభ్యర్ధిగా భారీ మెజారిటీతో విజయం సాధించారు.

 ఆ తర్వాత ఆయనను  కేసీఆర్ తన కేబినెట్ లోకి తీసుకొన్నారు ఎంపీ పదవికి కడియం రాజీనామా చేశారు. ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. గతంలో కేసీఆర్ కేబినెట్ లో కడియం శ్రీహరి డిప్యూటీ సీఎంగా కూడ కొనసాగారు.

కేసీఆర్ తన కేబినెట్ ను ఈ నెలాఖరుకు విస్తరించే ఛాన్స్ ఉంది. అయితే వరంగల్ జిల్లా నుండి  గతంలో  కడియం శ్రీహరితో పాటు చందూలాల్  మంత్రిగా కొనసాగారు.ఈ దఫా చందూలాల్  ఓటమి పాలయ్యారు. వెలమ సామాజిక వర్గానికి చెందిన జూపల్లి కృష్ణారావు కూడ  కొల్లాపూర్ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

గతంలో కేసీఆర్ కేబినెట్ లో కేసీఆర్,జూపల్లి కృష్ణారావు, హరీష్ రావు, కేటీఆర్ లు వెలమ సామాజిక వర్గానికి చెందినవారు. దీంతో  ఎర్రబెల్లి దయాకర్ రావుకు చోటు దక్కలేదు.  ఈ దఫా ఎర్రబెల్లికి కేసీఆర్ కేబినెట్ లో బెర్త్ ఖాయంగా కన్పించే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 

 కేటీఆర్ కు పార్టీ పదవి అప్పగించిన నేపథ్యంలో మంత్రివర్గంలోకి తీసుకొంటారా లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.హరీష్ రావును కేబినెట్ లో తప్పకుండా తీసుకొంటారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్ రావులు ఇంతవరకు ఒకే కేబినెట్ లో లేరు. ఈ దఫా కూడ కడియం శ్రీహరికి మరోసారి కేసీఆర్ తన కేబినెట్‌లో చోటు కల్పించి దయాకర్ రావుకు కూడ మంత్రి పదవిస్తే ఒకే గ్రామానికి చెందిన ఇద్దరికి కూడ మంత్రి  పదవులు దక్కనున్నాయి.  మంత్రి కావాలనే దయాకర్ రావు కల ఈ దఫానైనా నెరవేరనుందా  లేదా అనేది  త్వరలో తేలనుంది.

Follow Us:
Download App:
  • android
  • ios