తెలంగాణలో ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తోంది. అన్ని పార్టీల అభ్యర్థులు.. ఇంటింటికీ తిరుగుతూ.. తమను గెలిపించాలంటూ ప్రచారం చేస్తున్నారు. ఓట్లు అడగడానికి వచ్చిన అభ్యర్థుల వెంట.. వేలాది మంది కార్యకర్తలు వచ్చి పార్ట కరపత్రాలు అవీ పంచుతూ ఉండటం గమనించే ఉంటారు. వారంతా నిజంగా పార్టీ కార్యకర్తలా అంటే లేదనే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది.

కేవలం ఎన్నికల కోసం రోజువారీ కూలీలను కార్యకర్తల పేరిట ప్రచారానికి తీసుకువస్తున్నారు. గతంలో రోజుకి రూ.500 , బిర్యానీ ప్యాకెట్ ఇస్తే.. కార్యకర్తలుగా నటించేందుకు వేల మంది ముందుకు వచ్చేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. రోజుకి రూ.వెయ్యిఇస్తామన్నా చాలా మంది ముందుకు రాకపోవడం విశేషం.

రూ.వెయ్యి కోసం.. రోజంతా దుమ్ము,దూళీ మధ్య మేము నడవలేమంటూ ముఖం మీద చెప్పేస్తున్నారట. కావాలంటే సభలకు వచ్చి కూర్చుంటాం.. అంతేకానీ.. ఇలా ప్రచారానికి మాత్రం రాలేమని చెబుతున్నారు. దీంతో చేసేదేమీ లేక కొందరు అభ్యర్థులు వెనుదిరుగుతంటే.. మరికొందరు మరింత డబ్బు ఆశచూసి వారిని రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. 

ఒకప్పుడు పార్టీలు.. కార్యకర్తలకు ప్రాముఖ్యత ఎక్కువగా ఇచ్చేవారు. ఇప్పుడు ఆ ప్రాధాన్యత తగ్గడంతో.. కార్యకర్తలుగా పార్టీకి సేవచేయడానికి  కూడా చాలా మంది అయిష్టత చూపుతున్నారు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే వాడుకుంటున్నారని.. తర్వాత ఏ కష్టం వచ్చినా పట్టిచుకోవడం లేదనేది వారి వాదన. దీంతో.. ఈ అద్దె కార్యకర్తలకు వేలల్లో డబ్బులు ముట్టచెబుతూ తమ వెంట తిప్పుకుంటున్నారు నేతలు.