ఘనశ్యామదాస్ జెమ్స్ అండ్ జ్యువెల్స్ మేనేజింగ్ పాట్నర్ సంజయ్ అగర్వాల్‌ను (sanjay agarwal)ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. రుణాల పేరుతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)ని మోసం చేసిన కేసులో సంజయ్ అగర్వాల్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఘనశ్యామదాస్ జెమ్స్ అండ్ జ్యువెల్స్ మేనేజింగ్ పాట్నర్ సంజయ్ అగర్వాల్‌ను (sanjay agarwal)ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. రుణాల పేరుతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)ని మోసం చేసిన కేసులో సంజయ్ అగర్వాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని ఈడీ ధ్రువీకరించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు (SBI) 67 కోట్ల రూపాయల నష్టాన్ని కలిగించిన కేసులో అగర్వాల్‌ను మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA), 2002 కింద శుక్రవారం అరెస్టు చేసినట్లు ఈడీ అధికారి తెలిపారు. సంజయ్ అగర్వాల్‌పై కేసు నమోదైన తర్వాత.. శుక్రవారం మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ అధికారులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని పీఎంఎల్‌ఏ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం 15 రోజుల రిమాండ్ విధించడంతో సంజయ్ అగర్వాల్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు.
సంజయ్ అగర్వాల్‌తో పాటుగా ఇతరులపై సీబీఐ బెంగళూరు యూనిట్ ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద నమోదు చేసిన కేసుల ఆధారంగా.. ఈడీ అధికారులు మనీ లాండరింగ్ విచారణ చేపట్టారు. సంజయ్ అగర్వాల్, అతని సంస్థపై CBI మరో ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేసింది. సంజయ్ అగర్వాల్ తన సంస్థ ద్వారా పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి గోల్డ్ లోన్ తీసుకున్నాడు. ఆ తర్వాత బ్యాంకు నుంచి బంగారం, ఆభరణాలను మోసపూరితంగా తొలగించడంతో బ్యాంక్‌కు రూ. 31.97 నష్టం వాటిల్లింది.
‘2010, 2011 సంవత్సరాలలో.. అతను నకిలీ బ్యాంక్ గ్యారెంటీలు, పీఎన్‌బీ జారీ చేసిన కవరింగ్ లెటర్‌లను తయారు చేయడం ద్వారా.. ఎస్‌బీఐ నుంచి బంగారు కడ్డీని మోసపూరితంగా సేకరించాడు. స్థానిక మార్కెట్‌లోని బంగారు కడ్డీని వివిధ జ్యువెలర్స్ మరియు చిన్న వ్యాపారులకు నగదు రూపంలో విక్రయించాడు’ అని ఈడీ అధికారి తెలిపారు. అలా వచ్చిన నగదును సంజయ్ అగర్వాల్ తన భార్య, సోదరులు మరియు అతని ఉద్యోగుల పేరుతో అనేక ఇతర సంస్థలకు మళ్లించారు.
తర్వాత మోసం జరిగినట్టుగా గుర్తించిన ఎస్‌బీఐ.. అంతర్గత విచారణ చేపట్టింది. అందులో నిందితులు నకిలీ లేఖలు, బ్యాంక్ గ్యారెంటీలు సమర్పించినట్లు గుర్తించారు. ఇక, 2011 ఆగస్ట్ 12న సంజయ్ అగర్వాల్, అతని సోదరులు అజయ్, వినయ్ హైదరాబాద్‌లోని అబిడ్స్‌లోని తమ స్టోర్‌లో ఉంచిన మొత్తం బంగారం, ఆభరణాలను స్టాక్‌ను బిడ్‌లలో రహస్యంగా తొలగించారు. సంస్థ పొందిన బంగారు రుణానికి వ్యతిరేకంగా స్టాక్ ఇప్పటికే PNBకి హైపోథికేట్ చేయబడింది.
గతంలో సుంకం లేకుండా బంగారాన్ని దిగుమతి చేసి స్థానిక మార్కెట్‌లో విక్రయించిన కేసులో సంజయ్ అగర్వాల్‌ను కోలకత్తా ఈడీ అధికారులు అరెస్టు చేశారు. జైల్లో ఉన్న సంజయ్‌ను పీటీ వారెంట్‌పై హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. నాంపల్లి ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా సంజయ్‌కు న్యాయస్థానం జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ కొసాగుతుందని ఈడీ వెల్లడించింది.
