హైదరాబాద్: ఎన్నికల వ్యయ వివరాలు అందజేయని అభ్యర్థులకు ఈసీ నోటీసులు జారీ చేసింది. 52 మంది అభ్యర్థులు ఇంతవరకు లెక్కలు చూపలేదు.  మూడు దఫాల్లో నోటీసులకు సమాధానం ఇవ్వకపోతే అనర్హత వేటు వేసే అవకాశం ఉంది.

తెలంగాణ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1821 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో 1702 మంది ఓటమి పాలయ్యారు.  పోటీ చేసిన అభ్యర్థులు  ఎన్నికల్లో  చేసిన ఖర్చులకు  సంబంధించిన లెక్కలను ఈసీకి అందించాల్సి ఉంటుంది.

ఎన్నికలు ముగిసిన 45 రోజుల్లోపుగా పోటీ చేసిన అభ్యర్ధులు లెక్కలను ఈసీకి అందించాలి. నిర్ణీత గడువులోపుగా లెక్కలు చూపని అభ్యర్థులపై అనర్హత వేటు వేయనున్నారు.  కనీసం ఆరేళ్ల పాటు ఎన్నికల్లో  పోటీ చేయకుండా అనర్హత వేటు వేయనున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసిన 77 మంది అభ్యర్థులకు తొలి విడతగా ఈసీ నోటీసులు జారీ చేసింది. వీరిలో 20 మంది స్పందించి లెక్కలను అందించారు. ఇంకా 52 మంది మాత్రం ఇంకా లెక్కలను ఇవ్వలేదు.  ఈ 52 మందికి రెండో దఫా ఈసీ నోటీసులు జారీ చేసింది. 

పాలకుర్తి నియోజకవర్గంలో అత్యధికంగా ఏడుగురు, స్వతంత్ర అభ్యర్థులున్నారు. దేవరకొండలో ఆరుగురు, నల్గొండలో అయిదుగురు, నాగార్జునసాగర్, మునుగోడు, ములుగు నియోజకవర్గాల్లో నలుగురు చొప్పున ఉన్నారు. 

మల్కాజిగిరి, మిర్యాలగూడల్లో ముగ్గురు, నకిరేకల్‌లో ఇద్దరు, జుక్కల్, రామగుండం, కరీంనగర్, నారాయణఖేడ్, గజ్వేల్, పరిగి, వికారాబాద్, మేడ్చల్, నారాయణపేట, హుజూర్ నగర్, ఆలేరు, డోర్నకల్, మహబూబాబాద్ , వర్ధన్నపేట నియోజకవర్గాల్లో ఒక్కో అభ్యర్థి  ఈసీకి లెక్కలు సమర్పించలేదు.  

ఈ నోటీసుకు  స్పందించకపోతే మరో నోటీసును జారీ చేస్తారు. నెల రోజుల్లో మూడో నోటీసు జారీ చేస్తారు.  మూడు నోటీసులకు స్పందించని అభ్యర్థులపై అనర్హత వేటు వేయనున్నారు.