షాక్: హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ సతీమణి జమునకు చేదు అనుభవం
మాజీ మంత్రి, బిజెపి నేత ఈటల రాజేందర్ సతీమణి జమున హుజూరాబాద్ లో చేదు అనుభవం ఎదురైంది. హూజూరాబాదు ప్రచారంలో ఉండగా ఓ వ్యక్తి జమున ఎదుట తీవ్ర నిరసన వ్యక్తం చేశాడు.
హుజూరాబాద్: మాజీ మంత్రి, బిజెపి నేత ఈటల రాజేందర్ సతీమణి జమునకు హుజూరాబాద్ లో చేదు అనుభవం ఎదురైంది. జమున హుజూరాబాద్ పర్యటనలో ఓ వ్యక్తి ఆమె ముందు గడియారం పగులగొట్టి నిరసన వ్యక్తం చేశఆడు. ఈ ఘటనతో ఆమె నిశ్చేష్టురాలయ్యారు. ఆమె భర్త ఈటల రాజేందర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
అనూహ్యమైన ఆ పరిణామానికి ఈటల రాజేందర్ అనుచరులు షాక్ తిన్నారు. తన ప్రచారంలో భాగంగా జమున శనివారం హుజూరాబాద్ లోని మామిళ్లపల్లి వెళ్లారు. ఆ సమయంలో కాలనీకి చెందిన శ్రీను అనే వ్యక్తి ఎదురు వచ్చాడు. తన కుమారుడు క్రీడా పోటీలకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించాడని, ఈటల రూ.5 లక్షల పరిహారం ప్రకటించారని అతను చెప్పాడు.
అయితే, తమకు లక్ష రూపాయలు మాత్రమే ఇచ్చారని, మిగతా రూ.4 లక్షలు ఇప్పటి వరకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై శ్రీను జమునను నిలదీశాడు. ప్రచారంలో ఈటల రాజేందర్ ఫొటో ఉన్న గడియారాన్ని నేలకేసి కొట్టి నిలదీశాడు.
శ్రీను భార్యకు సాంఘిక సంక్షేమ వసతిగృహంలో ఉపాధి కల్పించారు. అయితే, నగదు నాలుగు లక్షల రూపాయలు మాత్రమే ఇప్పటి వరకు అందనట్లు తెలుస్తోంది. ఈటల రాజేందర్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారు. దీంతో హుజురాబాద్ నుంచి గెలిచిన రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బిజెపిలో చేరారు. దీంతో హుజూరాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది.
ఈ క్రమంలో ఈటల రాజేందర్ మాత్రమే కాకుండా ఆయన భార్య జమున కూడా అప్పుడే హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగానే జమున హుజూరాబాద్ లో ఇంటింటికి వెళ్లి ప్రచారం సాగిస్తున్నారు.