తన బొందిలో ప్రాణం ఉన్నంత వరకు హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలను కాపాడుకుంటానని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. నాగార్జున సాగర్లో గెలిచినట్లు ఇక్కడ కూడా చేస్తామంటే ప్రజలు పాతరేస్తారని తెరాస నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 

స్థానిక నేతలు బ్లాక్మెయిల్ చేసే పద్దతి మానుకోవాలని హితవు పలికారు. ఆత్మగౌరవ బావుటా ఎగుర వేయడానికి నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. హుజురాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు.

‘నాపై కక్షపూరితంగా వ్యవహరించొచ్చు.. కానీ మా ప్రజల్ని మాత్రం వేధించే ప్రయత్నం చేయొద్దు. నియోజకవర్గానికి ఇంఛార్జిగా వస్తున్నవారు ఏనాడైనా ఆపదలో ఆదుకున్నారా? సర్పంచ్, ఎంపిటీసి, ఎంపీపీ గెలుపులో తోడ్పాటు అందించారా? కాంట్రాక్టర్లు, సర్పంచులను బిల్లులు రావని బెదిరిస్తున్నారు.

గ్రామాలకు రూ. 50 లక్షలు, కోటి రూపాయలు నిధులు రావాలంటే తమతో ఉండాలని చెబుతున్నారు. స్థానిక నేతలపై ఒత్తిడి రాజకీయాలు చేస్తున్నారు. దీన్ని హుజురాబాద్, తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇంత అన్యాయం.. అక్రమమా? ఇదేం రాజకీయమని అసహ్యించుకుంటున్నారు. 

అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అలా అనుకుంటే భ్రమల్లో ఉన్నట్టే.. బ్లాక్ మెయిల్ రాజకీయాలు పనికిరావు. 2023 తర్వాత తెరాసకు అధికారం ఉండదు. ఇప్పుడు మీరేం చేస్తున్నారో.. ఆ తర్వాత మేము ఆ పని తప్పకుండా చేస్తామని హెచ్చరిస్తున్నా. మర్యాదగా నడుచుకోండి. మా ప్రజలు నన్ను 20 ఏళ్లుగా గుండెల్లో పెట్టుకున్నారు. దేవుళ్ళను మొక్కను ప్రజల హృదయాలనే గుడులుగా భావిస్తా.. ఆపదలో ఆదుకునే ప్రయత్నం చేస్తుంటా.. తల్లిని, బిడ్డను వేరు చేసే ప్రయత్నం చెల్లదు. 

స్థానిక నేతలను ప్రలోభ పెడితే తాత్కాలికంగా మీకు జై కొట్టొచ్చు. కానీ వారి హృదయాలు ఘోషిస్తున్నాయి. హుజురాబాద్ ప్రజల్ని ఎవరూ కొనలేరు. ఇక్కడి ప్రజలు అనామకులు కాదు. ప్రజల్ని రెచ్చగొట్టొద్దు. దాదాగిరి పద్ధతి, హెచ్చరికలను ఆపకపోతే కరీంనగర్ కేంద్రంగానే ఉద్యమం చేయాల్సి ఉంటుంది..’ ఆయన హెచ్చరించారు.