తెలంగాణ రైతాంగం పండించిన ధాన్యాన్ని సేకరించకుండా కేవలం తన స్వార్థ రాజకీయాల కోసమే సీఎం కేసీఆర్ కేంద్రంతో పేచీకి దిగుతున్నారని బిజెపి నేత ఈటల రాజేందర్ అన్నారు.
ఆసిఫాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం తన కుర్చీ కోసమే ధాన్యం కొనుగోలుపై కావాలనే వివాదం సృష్టించి రైతులను బలిచేస్తున్నారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. కేసీఆర్ కుర్చీ లేకుండా, ఆయన కుటుంబం అధికారం లేకుండా బ్రతుకలేదని ఈటల ఎద్దేవా చేసారు. కేవలం మీ స్వార్థ రాజకీయాల కోసం అమాయకులైన తెలంగాణ రైతాంగాన్ని బలిచేస్తారా కేసీఆర్? అని ఈటల నిలదీసారు.
దేశమంతా వడ్లు కొంటుంటే ఒక్క తెలంగాణలో మాత్రం కొనడం లేదని అన్నారు. కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే కేసీఆర్ సర్కార్ వడ్ల కొనుగోలును ప్రారంభించలేదన్నారు. దేశమంతా లేని బాధ, కష్టం కేవలం మన దగ్గరే ఎందుకు వచ్చిందో రైతన్నలు ఆలోచించాలన్నారు. కరెంటు ఫ్రీ, రైతు బంధు, రైతు బీమాకు వేల కోట్లు ఇస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం మరికొన్ని కోట్లు ఖర్చుచేసి ధాన్యం కొనుగోలు చేయడం లేదు... ఎందుకు రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు? ఈ ప్రశ్నలు కేసిఆర్ సమాధానం చెప్పాలని ఈటల కోరారు.
వీడియో
సిర్పూర్ నియోజకవర్గ బిజెపి నేత పాల్వాయి హరీష్ రావు ఆరు రోజులుగా చేపట్టిన ప్రాణహిత జలసాధన పాదయాత్ర ఇవాళ(శుక్రవారం) ముగిసింది. ఈ సందర్భంగా ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహట్టి ప్రాణహిత పుష్కర ఘాట్ వద్ద భారీ ముగింపు సభ ఏర్పాటుచేసారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.
''నీళ్లకు నిలయం... వర్షాలకు అడ్డా అదిలాబాద్. గోదావరి, పెనుగంగ, ప్రాణహిత నదుల సంగమం. అయినప్పటికి అదిలాబాద్ తూర్పు ప్రాంతం కరువు కాటకాలతో అలమటిస్తుంది. ఇది గుర్తించే 2008 కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా వుండగా 38 వేల కోట్లతో బీఆర్ అంబేడ్కర్ పేరుతో భారీ నీటిపారుదల ప్రాజెక్ట్ పనులు ప్రారంభించారు. అయితే పనులు ప్రారంభమై 14 సంవత్సరాలు గడిచిపోయినా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్, బెల్లంపల్లి, చెన్నూరు, ఆసిఫాబాద్ నియోజకవర్గాలకు చుక్క నీరు రాలేదు'' అని ఈటల ఆందోళన వ్యక్తం చేసారు.
''తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక కాళేశ్వరం పేరుమీద ఆగమేఘాలపై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాజెక్ట్ పూర్తిచేసారు. కానీ ప్రాజెక్ట్ పనులు మొదలుపెట్టిన ఈ జిల్లా కేవలం కాలువలకే పరిమితమయ్యింది. కాలువలు తవ్వినప్పటికీ చుక్కనీరు ఇవ్వకుండా ఈ ప్రాంత ప్రజల కళ్ళల్లో కేసీఆర్ మట్టికొట్టారు. దీంతో పాల్వాయి హరీష్ పాదయాత్ర చేసి ప్రగతి భవన్ లో ఉన్న పెద్దలకు ఈ ప్రాంత ప్రజల ఆక్రందనలు వినిపించే ప్రయత్నం చేశారు'' అన్నారు.
''కాలువల్లో నీళ్ళు ఉన్నా కేసిఆర్ వల్లే రైతులు లక్షలాది ఎకరాల్లో పంటలు వేసుకోలేదు. తెలంగాణలో రైతులు బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతున్నారు. ఒకనాడు పల్లెలు బాగుపడకుండా బంగారు తెలంగాణ సాధ్యంకాదు అని చెప్పారు కేసిఆర్. కానీ ఆయన మాటలేవీ నెరవేరడం లేదు'' అన్నారు.
''పల్లెల్లో అన్ని వర్గాలను ఆదుకొనే తల్లి భూతల్లి. కోట్ల మంది ప్రజానీకానికి ఉపాధి కల్పించేది వ్యవసాయం. అలాంటి వ్యవసాయం ను అయోమయంలో పడేసారు కెసిఆర్. ఇకపై ఉప్పుడు బియ్యం అందించమని కేంద్రానికి లేఖ రాసిన కేసిఆర్ మళ్ళీ ఇప్పుడు పేచీ పెడుతున్నారు. ఎండాకాలం పంటకు క్వింటాల్ కి 10 కేజీ లో 15 కేజీలు నూకలు ఎక్కువ వస్తాయి. వీటికి లెక్క కడితే ఎండాకాలం పంటమీద వచ్చే నష్టం రూ.800 నుండిరూ.1000 కోట్లు రావచ్చు. ఇన్ని వేల కోట్లు ఖర్చుచేస్తున్నామని చెప్పుకునే మీరు కేవలం రూ.1000 కోట్లు రైతులకోసం ఖర్చు చేయలేరా?'' అని నిలదీసారు.
''2018 ఎన్నికల సమయంలో 57 సంవత్సరాలు నిండినవారికి 2 వేల రూపాయల ఫించన్ ఇస్తానని ఆశచూపి డబ్బాల్లో ఓట్లు వేసుకొన్నారు. ఇలా ఒడ్డుపైకి చేరాక బోడ మల్లప్ప అన్నట్టు ప్రజలను వాడుకొని వదిలేసిన వ్యక్తి కెసిఆర్. రూ.3016 నిరుద్యోగ భృతి ఏమైంది? కేసీఆర్ మాటలే గొప్పగా ఉంటాయి... చేతలు మాత్రం ఉండవు. ఆయన మాటలకు, చేతలకు పొంతన ఉండదు. ముసలివారిని, నిరుద్యోగులను మోసం చేసినట్టే కెసిఆర్ రైతులను మోసం చేశారు'' అని ఈటల ఆరోపించారు.
''హుజూరాబాద్ లో ఎన్ని అక్రమాలు చేసిన మా ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు. ప్రజల గొంతుకను కాపాడుకొకపోతే బానిసలం అవుతామని నన్ను గెలిపించారు. ఇది కేవలం హుజూరాబాద్ కే పరిమితం కాదు. తెలంగాణ అంతా వ్యాపిస్తుంది. కెసిఆర్... నీ కుట్రలు కుతంత్రాలు చేదిస్తాం.. భారతీయ జనతా పార్టీ నీ అధికారంలోకి తీసుకువస్తాం. ప్రజల సమస్యలు అన్నీ మన ప్రభుత్వంలో తీరుస్తాం'' అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
