హైదరాబాద్: నాగార్జుసాగర్ శాసనసభ సీటుకు జరిగే ఉప ఎన్నికల్లో స్థానిక నాయకుడిని, అది కూడా బీసీ వర్గాల నుంచి అభ్యర్థిని ఎంపిక చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు ఆలోచన చేస్తున్నారు. ప్రత్యేకంగా యాదవ సామాజిక వర్గం నుంచి అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశాలున్నాయి. 

నాగార్జున సాగర్ లో సానుభూతి ఓట్లపై ఆధారపడకూడదని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం దుబ్బాకలో మృతి చెందిన ఎమ్మెల్యే రామలింగారెడ్డి సతీమణిని పోటీకి దించినప్పటికీ ఓటమి పాలయ్యారు. ఈ అనుభవంతో నోముల నరసింహయ్య కుటుంబ సభ్యుల నుంచి అభ్యర్థిని ఎంపిక చేయకూడదని భావిస్తున్నట్లు సమాచారం. నోముల నరసింహయ్య మృతితో నాగార్జునసాగర్ శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది.

కేసీఆర్ ఆలోచన నేపథ్యంలో నోముల నరసింహయ్య కుమారుడు నోముల భరత్ కు షాక్ తగిలే అవకాశం ఉంది. నోముల భరత్ ఆ సీటును ఆశిస్తున్నారు. భరత్ నల్లగొండ జిల్లా నక్రేకల్ మండలం పాలెం గ్రామానికి చెందినవారు. అయితే, నామినేటెడ్ పోస్టు ఇస్తానని కేసీఆర్ భరత్ కు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

నాగార్జునసాగర్ లో పోటీ దింపడానికి కేసీఆర్ ముగ్గురి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ ముగ్గురు యాదవ సామాజిక వర్గానికి చెందినవారే. త్రిపురారం మండలానికి చెందిన పెద్దబోయిన శ్రీనివాస్ యాదవ్, నిడమనూరు మండలానికి చెందిన మన్మెం రంజింత్ యాదవ్, కట్టెబోయిన గురవయ్య యాదవ్ పేర్లను ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.