హైదరాబాద్: ఓ మహిళను నమ్మించి ఆమె సొమ్మును దొంగిలించిన యువకుడిని హైదరాబాదులోని సరూర్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. మీడియా సమావేశంలో డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ నిందితుడి వివరాలు వెల్లడించారు. 

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలంలోని పందిళ్లకి చెందిన బొమ్మగాని శ్రీనివాస్‌(34) జీవనోపాధికి 2008లో దుబాయ్‌ వెళ్లాడు. రెండేళ్ల తర్వాత స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత వివాహం చేసుకుని నగరానికి వచ్చాడు. గొడవల కారణంగా భార్యకు దూరంగా ఉంటున్నాడు. 

కర్మన్‌ఘాట్‌ సమీపంలోని మల్‌రెడ్డి రంగారెడ్డి కాలనీలో ఉంటూ మేరీ అనే మహిళతో పరిచయం పెంచుకున్నాడు. ఆమెకు పనుల్లో సాయపడుతూ దగ్గరయ్యాడు. ఇటీవల ఆ మహిళ ఓఇంటిని కొనుగోలు చేసింది. అందుకు సంబంధించిన బకాయి చెల్లించేందుకు రూ.14లక్షలు తెచ్చి ఇంట్లో దాచింది. 

ఈ డబ్బుపై ఆశపడిన శ్రీనివాస్‌ తన అవసరాలకు కొంత ఇమ్మంటూ కోరాడు. అయితే ఆమె నిరాకరించింది. దీంతో డబ్బును దోచుకుని పారిపోయాడు. ఆమె ఫిర్యాదుమేరకు సరూర్‌నగర్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

శ్రీనివాస్ తాను దోచిన సొమ్ముతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు ప్రయాణం చేస్తూ పోలీసులను ముప్పు తిప్పలు పెట్టాడు. చివరకు సూర్యపేట జిల్లా పొనుగోడులోని స్నేహితుని ఇంట్లో తలదాచుకున్న అతడ్ని పట్టుకున్నారు. అతని వద్ద రూ.13.5లక్షలు నగదు, ఓ సెల్‌ఫోను స్వాధీనం చేసుకున్నారు.

"