హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో రోజుకోచోట మందుబాబులు వీరంగం సృష్టిస్తున్నారు. ఇటీవల మద్యంమత్తులో వాహనాన్ని నడిపిన యువకులు ఓ పోలీస్ అధికారి ప్రాణాలను బలితీసుకున్న విషాదాన్నిమరువక ముందే తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మద్యం మత్తులో వాహనం నడుపుతూ మూడు స్కూటర్‌లను ఢీకొట్టి భీభత్సం సృష్టించాడు. ఈ  ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 

వివరాల్లోకి వెళితే... షేక్ పేట ఆదిత్య టవర్స్ లో నివాసముంటున్న వేణు(25) సాఫ్ట్ వేర్ ఇంజనీర్.గత ఆదివారం సెలవురోజు కావడంతో స్నేహితులతో కలిసి మందుపార్టీ చేసుకున్నాడు. ఇలా హిమాయత్ నగర్ లో మందుపార్టీ చేసుకున్న వేణు అక్కడే పడుకుని సోమవారం ఉదయం ఇంటికి బయలుదేరాడు. అయితే రాత్రి మత్తు దిగకపోయినా కారు డ్రైవ్ చేయడంతో ప్రమాదం జరిగింది. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద సిగ్నల్ పడినప్పటికి ఆపకుండా ముందుకెళ్లి ఆగివున్న బైక్ లను ఢీకొట్టాడు. దీంతో మూడు బైక్ లు నుజ్జునుజ్జవగా ముగ్గురు గాయపడ్డారు. 

ప్రమాదం జరిగిన వెంటనే వేణు కారును అక్కడే  వదిలేసి పరారయ్యాడు. అయితే అతడి వెంటాడి పట్టుకున్న ట్రాఫిక్ పోలీసులు సివిల్ పోలీసులకు అప్పగించారు. నిందితుడికి బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్ష నిర్వహించగా 170 బీఏసీ నమోదైంది. ప్రమాదానికి కారణమైన కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సునీల్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది. అతడు అపోలో హాస్పిటల్ ఐసియూలో చికిత్స పొందుతుండగా మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.