హైదరాబాద్ లో నిన్న రాత్రి మెహిదీపట్నం నానల్ నగర్ క్రాస్ రోడ్స్ వద్ద జరిగిన డబల్ మర్డర్ సంచలనం సృష్టించింది. రౌడీ షీటర్లు చాంద్ మహమ్మద్, అబూ లపై దాదాపుగా 20మందికి పైగా గుర్తు తెలియని దుండగులు దాడి చేసి కత్తులు, తల్వార్లతో అతి కిరాతకంగా దాడిచేసి చంపేశారు. 

ఆ దాడిలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలను వదిలగా, మరొకరు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించాడు. లంగర్ హౌజ్ పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తునారంభించారు. హత్యలు జరిగాయని తెలియగానే సిటీ కమీషనర్ అంజనీ కుమార్ అక్కడకు హుటాహుటిన చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. కేసును ఛాలెంజ్ గా స్వీకరించిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేసారు. 

ఇద్దరు రౌడీ షీటర్లపైన ఇంతమంది కలిసి దాడి చేయడం వెనుక ఏమైనా పాతకక్షలు ఉన్నాయా, అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరు ఇటీవల కాలంలో ఏమైనా సెటిల్మెంట్లు చేశారా, ఏవయినా భూలావాదేవీలు జరిగాయా అనే కోణంలో కూడా ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. 

లాక్ డౌన్ వేళ రాత్రిళ్ళు కర్ఫ్యూ ఉన్నప్పటికీ... ఈ ఇరువురు బయటకు ఎందుకు వచ్చారు, అంతమంది ఒక్కసారిగా కర్ఫ్యూ సమయంలో ఎలా బయటకు రాగలిగారు అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. 

ఇకపోతే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వగానే ప్రజలు లాక్ డౌన్ ని సీరియస్ గా తీసుకోవడం లేదు, కర్ఫ్యూ రాత్రిళ్ళు అమలవ్వడంలేదు అనడానికి ఇవే ఉదాహరణలు, పోలీసులు కర్ఫ్యూ వేళ కూడా పహారా కాయడంలేదా అంటూ నెటిజన్లు పోలీసులపై విరుచుకుపడుతున్నారు. 

తెలంగాణపై కరోనా పంజా విసురుతోంది. గత కొన్ని రోజులుగా వందకు తక్కువ కాకుండా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం 143 కేసులు నమోదైనట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలో 116, రంగారెడ్డిలో 8, మహబూబ్‌నగర్‌లో 5, వరంగల్‌లో 3, ఖమ్మం, ఆదిలాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, కరీంనగర్‌లో రెండేసి కేసుల చొప్పున, మంచిర్యాలలో ఒక కేసు నమోదయ్యాయి. కాగా శుక్రవారం 8 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మరణాల సంఖ్య 113కి చేరింది.

తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,290కి చేరింది. వీరిలో 448 విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చినవారు, వలస కార్మికులు వున్నారు. ఇక రాష్ట్రంలో 1,627 మంది కోవిడ్ 19 నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 1,550 మంది బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కరోనా నియంత్రణ చర్యల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందుందన్నారు ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్. హైదరాబాద్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే కాలంలో కరోనా పరీక్షల సంఖ్య మరింత పెంచుతామని ఈటల స్పష్టం చేశారు.

గాంధీ వైద్యుల సేవలు, కృషిని అందరూ అభినందించాలని వృద్ధులు, చిన్నారులు కూడా గాంధీలో చికిత్స తర్వాత కోలుకున్నారని మంత్రి వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇంతటి సేవలు అందిస్తున్న వైద్యులు, నర్సులు, ఆరోగ్య సిబ్బందిని కాపాడుకోవాల్సిన అవసరం వుందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

కోవిడ్ 19 ఆసుపత్రుల్లో రెండంచెల విధానాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆరోగ్య సిబ్బంది రక్షణకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని... గాంధీ, నీలోఫర్, పేట్ల బురుజు, సుల్తాన్‌పూర్‌ ఆసుపత్రుల్లో అన్ని వసతులు కల్పించామని రాజేందర్ స్పష్టం చేశారు. కరోనా బాధితుల ప్రాణాలు నిలబెట్టేందుకు ఎంత ఖర్చయినా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈటల రాజేందర్ వెల్లడించారు.