కరోనా మహమ్మారి రోజు రోజుకీ విజృంభిస్తోంది. ఈ మహమ్మారి కారణంగా వేలల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. వారిని కాపాడేందుకు దేశ మంతటా వైద్యులు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు.  తాజాగా.. కరోనా రోగుల కోసం దాదాపు సంవత్సరన్నరగా సేవలు అందించిన ఓ వైద్యురాలు.. చివరకు ఆ కరోనా కారణంగానే ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 వరంగల్‌ అర్బన్‌ జిల్లా బొల్లికుంటకు చెందిన శోభారాణి ఎంజీఎం కొవిడ్‌ వార్డులో దాదాపు సంవత్సరన్నరగా  రోగులకు సేవలు అధించారు. అలా  విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో వారం క్రితం ఆమె వైరస్‌ బారినపడ్డారు. తొలుత వరంగల్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. 

ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో హైదరాబాద్‌ తీసుకెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఏ ఆస్పత్రిలోనూ ఆక్సిజన్‌ బెడ్‌ లభించకపోవడంతో వరంగల్‌లోనే చికిత్స కొనసాగించారు. ఆదివారం రాత్రి డాక్టర్‌ శోభారాణి మృతిచెందారు. ఈమె భర్త డాక్టర్‌ వెంకట్‌రావు హైదరాబాద్‌ నాచారం ఈఎస్ఐ ఆస్పత్రిలో వైద్యుడు కావడం గమనార్హం.