హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డేటా చోరీ కేసులో కీలక నిందితుడుగా అనుమానిస్తున్న ఐటీ గ్రిడ్ సంస్థ ఎండీ అశోక్ ఎట్టకేలకు దిగొచ్చారు. విచారణకు సిద్ధమంటూ బుధవారం ప్రత్యక్షమయ్యారు. విచారణకు సిద్ధమంటూ బుధవారం మాదాపూర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు అశోక్. 

అయితే విచారణలో భాగంగా సిట్ ఎదుట హాజరుకావాలని పోలీసులు సూచించారు. దీంతో గురువారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఎదుట విచారణకు హాజరుకానున్నారు అశోక్. గురువారం ఉదయం 11 గంటలకు గోషామహాల్ లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నారు ఐటీ గ్రిడ్ ఎంపీ అశోక్. 

సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏపీ ప్రజల డేటాను చోరీ చేశారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో తెలంగాణ పోలీసులు ఐటీ గ్రిడ్ సంస్థపై తెలంగాణ పోలీసులు దాడులు నిర్వహించారు. దాడులలో ప్రజలకు సంబంధించిన కీలక డేటా స్వాధీనం చేసుకుంది తెలంగాణ పోలీస్ శాఖ. 

కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. డేటా చోరీ అంశం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపడంతో తెలంగాణ ప్రభుత్వం విచారణకు సిట్ ను నియమించింది. సిట్ విచారణకు హాజరుకావాలంటూ ఐటీ గ్రిడ్ సంస్థ ఎండీ అశోక్ కు పలుమార్లు నోటీసులు జారీ చేశారు. కానీ అశోక్ విచారణకు హాజరుకాలేదు. 

అయితే ముందస్తు బెయిల్ కోసం ఇటీవలే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు అశోక్. మెుత్తానికి ఐటీ గ్రిడ్ సంస్థ ఎండీ అశోక్ సిట్ విచారణకు సిద్ధమవ్వడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.