Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో వికలాంగుల పెన్షన్ రూ.4,116కి పెంపు : కేసీఆర్ సంచలన ప్రకటన

తెలంగాణలో వికలాంగులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్ చెప్పారు. వికలాంగుల పెన్షన్ రూ.4,116కి పెంచుతున్నట్లు ప్రకటించారు. 

disabled persons pension increasing in telangana says cm kcr ksp
Author
First Published Jun 9, 2023, 7:56 PM IST

తెలంగాణలో వికలాంగులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్ చెప్పారు. వికలాంగుల పెన్షన్ రూ.4,116కి పెంచుతున్నట్లు ప్రకటించారు. సీఎం నిర్ణయం వల్ల 5,16,890 మంది దివ్యాంగులకు లబ్ధి చేకూరనుంది. శుక్రవారం మంచిర్యాలలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ.. సింగరేణిని కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం చేసిందన్నారు. మంచిర్యాల జిల్లా కోసం గతంలో ఎన్నో పోరాటాలు జరిగాయని.. సింగరేణిది 134 ఏళ్ల చరిత్ర, మన సొంత ఆస్తి అని కేసీఆర్ తెలిపారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే మంచిర్యాల జిల్లా ఏర్పాటు చేసుకున్నామన్నారు. రైతు బంధు ద్వారా రూ.65 వేల కోట్లను రైతులకు అందించామని కేసీఆర్ తెలిపారు. వరి ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్‌ను దాటేశామని.. 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫాంను పండించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కేసీఆర్ వెల్లడించారు. వచ్చే దసరా కానుకగా సింగరేణి కార్మికులకు రూ.700 కోట్లు బోనస్ ఇవ్వబోతున్నామని సీఎం పేర్కొన్నారు.

అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందున్నామని.. తెలంగాణ వచ్చాక సింగరేణఇ నడక మారిందని కేసీఆర్ పేర్కొన్నారు. సింగరేణి కాలరీస్ టర్నోవర్‌ను రూ.33 వేల కోట్లకు పెంచామని సీఎం వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామని.. అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. దేశంలో బొగ్గుకు కొరత లేదని.. 360 బిలియన్ టన్నుల బొగ్గు వుండగా విద్యుత్ రంగాన్ని ప్రైవేట్‌పరం చేస్తామని అంటున్నారని సీఎం దుయ్యబట్టారు. ఆస్ట్రేలియా నుంచి బొగ్గును దిగుమతి చేస్తున్నారని.. సింగరేణిని కాంగ్రెస్ సగం ముంచితే, బీజేపీ పూర్తిగా ముంచుతోందన్నారు. 

దేశంలోని చెడ్డ పాలసీలను అందరం కలిసి అడ్డుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ధరణి వుంటేనే రైతులు ఖాతాలో రైతు బంధు పడుతుందని కేసీఆర్ అన్నారు. ధరణితో పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తవుతుందని.. గతంలో రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగే గోస వుండేదని సీఎం పేర్కొన్నారు. ఇప్పుడా పరిస్ధితి లేదని.. ధరణితో మొత్తం మారిపోయిందన్నారు. చివరికి ముఖ్యమంత్రి కూడా మీ భూమిని మార్చలేడని కేసీఆర్ స్పష్టం చేశారు.

ధరణితో రైతుకే అధికారం ఇచ్చామని.. ధరణిని బంగాళాఖాతంలో విసిరేస్తామని అంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి వచ్చాక పల్లెలన్నీ ప్రశాంతంగా వుంటున్నాయని సీఎం అన్నారు. కాంగ్రెస్ ధరణి తీసేస్తే పాత రిజిస్ట్రేషన్ విధానం అమల్లోకి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ధరణి లేకపోతే పోలీస్ స్టేషన్‌ల చుట్టూ తిరిగే పరిస్ధితి వస్తుందని కేసీఆర్ హెచ్చరించారు. ధరణి లేకపోతే ఎన్ని హత్యలు , ఎన్ని గొడవలు జరిగేవని సీఎం ప్రశ్నించారు. ధరణి తీసేస్తే మళ్లీ దళారుల రాజ్యమే వస్తుందన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios