అక్రమంగా హైదరాబాద్ కు తరలిస్తున్న భారీ బంగారం శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడింది. సినీపక్కిలో బంగారాన్ని తరలించడానికి ప్రయత్నించిన ఓ ముఠాను  డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు విమానాశ్రయంలో పట్టుకున్నారు. వారి నుండి దాదాపు కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

అసోం రాజధాని గౌహతి నుండి అక్రమంగా హైదరాబాద్ కు బంగారాన్ని తరలించడానికి ఓ ముఠా పథకం వేసింది. ఇందుకోసం కిలో బంగారాన్ని ఓ కడ్డీగా మార్చి దానికి వెండి పూత పూశారు. ఇలా ఆ కడ్డీని గౌహతి నుండి ఇద్దరు వ్యక్తులు విమానంలో హైదరాబాద్ కు తీసుకువచ్చారు. అయితే వీరిపై  అనుమానం వచ్చిన డీఆర్ఐ అధికారులు తనిఖీ చేయగా ఓ వెండి కడ్డి దొరికింది. ఆ వెండి పూతను తొలగించడంతో స్వచ్చమైన బంగారం బయటపడింది. పట్టుబడ్డ బంగారానికి సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అలాగే నిందితులిద్దరిని అరెస్ట్ చేసిన అధికారులు పోలీసులకు అప్పగించారు. వారి వద్ద నుండి రెండు బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.  పట్టుబడిన బంగారం దాదాపు రూ.31,68,000 లక్షల విలువ ఉంటుందని అధికారులు తెలిపారు.