నిన్న గాక మొన్న ఆంధ్రప్రదేశ్ లో ఒక పేద మహిళ పోలీసులకు కూల్ డ్రింక్స్ తీసుకొచ్చి తన ఉదారతను చాటుకుంటే ఈ రోజు తెలంగాణలో ఒక వృద్ధ మహిళ పోలీసుల కష్టాన్ని చూసి చలించిపోయింది. తాను మీసేవలో కార్మికురాలిగా పని చేస్తానని రోజు రోడ్లపై విధులు చేస్తున్న పోలీసులను చూస్తే చాల బాధ కలుగుతుందని చెప్పింది. 

అలా చెప్పటమే కాదు తన దగ్గర ఉన్న డబ్బులతో వారికి బిస్కట్లు, కూల్ డ్రింక్స్ తీసుకొచ్చి అక్కడే విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు అందజేస్తూ ఈ లాక్ డౌన్ తో ప్రతి ఒక్కరు తమ ఇళ్లలోనే ఉండి కుటుంబ సభ్యులతో గడుపుతున్నారని కానీ పోలీసులు మాత్రం రోడ్లపై తిప్పలు పడుతున్నారని వారి బాధ కొంచెమైనా అర్ధం చేసుకోవాలని కోరింది. అనవసరంగా రోడ్లపైకి వచ్చేవారు పోలీసుల అవస్థ చూసి కొంచెమైనా మారాలని అంటోంది.

ఇదిలా ఉంటె ఈ వృద్ధ మహిళ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా సాక్షాత్తు రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి స్పందించారు. అర్ధం చేసుకునే మీలాంటి తల్లులు ఉన్నంత కాలం పోలీసులు ఎప్పటికి అలసిపోరని, మీ ప్రేమపూర్వక మాటలతో కరోనాపై పోరాడుతున్న పోలీసులకు బలం చేకూరినట్లయ్యిందని అన్నారు.