హైదరాబాద్: కాంగ్రెస్,టీడీపీ, వైసీపీ, బీఎస్పీ, సీపీఐ నుండి టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలు ఈ దఫా గులాబీ కండువాతో విజయం సాధించారు. 

2014 ఎన్నికల్లో ఇతర పార్టీల నుండి  విజయం సాధించిన 28 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరారు. వీరిలో తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డికి కేసీఆర్ తన మంత్రివర్గంలో చోటు కల్పించారు.

2014లో టీడీపీ నుండి తలసాని శ్రీనివాస్ యాదవ్ పోటీచేసి విజయం సాధించి ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. బీఎస్పీ అభ్యర్థిగా నిర్మల్‌ నుండి పోటీ చేసిన ఇంద్రకరణ్ రెడ్డి బీఎస్పీని టీఆర్ఎస్‌లో విలీనం చేశారు. ఈ దఫా వీరిద్దరూ కూడ టీఆర్ఎస్ టిక్కెట్టుపై పోటీ చేసి విజయం సాధించారు.

టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి ఈ దఫా కొడంగల్ నుండి పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.2009, 2014 ఎన్నికల్లో టీడీపీ నుండి రేవంత్ రెడ్డి ఈ స్థానం నుండి పోటీ చేసి విజయం సాధించారు.

టీఆర్ఎస్ టికెట్టు దక్కని కారణంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన కొండా సురేఖ పరకాల నుండి పోటీ చేసి ఓటమిపాలైంది.2014 ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్‌లో చేరి వరంగల్ తూర్పు నుండి కొండా సురేఖ భారీ మెజారిటీతో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో పరకాల నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించి టీఆర్ఎస్‌లో చల్లా ధర్మారెడ్డి చేరారు.

ఈ దఫా టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన చల్లా ధర్మారెడ్డి  చేతిలో  కొండా సురేఖ ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో  మిర్యాలగూడ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన భాస్కర్‌రావు ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. ఈ దఫా భాస్కర్ రావు మరోసారి టీఆర్ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.

2014 ఎన్నికల్లో ఎల్బీనగర్‌ నుండి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించిన ఆర్. కృష్ణయ్య ఈ దఫా కాంగ్రెస్ అభ్యర్థిగా మిర్యాలగూడ నుండి పోటీ చేసి భాస్కర్ రావు చేతిలో ఓటమి పాలయ్యారు. 

గతంలో చేవేళ్ల నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన కాలె యాదయ్య ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్  అభ్యర్థిగా పోటీ చేసిన కేఎస్ రత్నంపై కాలె యాదయ్య విజయం సాధించారు.

ఈ ఎన్నికల్లో  కాలె యాదయ్య టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయగా, కాంగ్రెస్ అభ్యర్థిగా కేఎస్ రత్నం పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో  కేఎస్ రత్నంపై మరోసారి కాలె యాదయ్య విజయం సాధించారు.

గత ఎన్నికల్లో చొప్పదండి నుండి టీఆర్ఎస్‌  అభ్యర్థిగా పోటీ చేసిన బొడిగె శోభ భారీ మెజారిటీతో విజయం సాధించింది.ఈ ఎన్నికల్లో  శోభకు టీఆర్ఎస్ టిక్కెట్టు నిరాకరించారు. బీజేపీ నుండి ఈ దఫా శోభ పోటీ చేసింది.  కానీ ఆమెకు ఈ ఎన్నికల్లో విజయం దక్కలేదు.

గత ఎన్నికల్లో  వైరా నుండి వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించిన బానోతు మదన్ లాల్ టీఆర్ఎస్ లో చేరారు. ఈ దఫా టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఇండిపెండెంట్ అభ్యర్థి రాములు నాయక్ చేతిలో ఓటమి పాలయ్యారు.

పాలకుర్తి నుండి 2014 లో  టీడీపీ నుండి పొటీ చేసి విజయం సాధించిన ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ దఫా టీఆర్ఎస్ నుండి పోటీ చేసి విజయం సాధించారు. గత ఎన్నికల్లో  రాజేంద్రనగర్ నుండి ప్రకాష్ గౌడ్, కూకట్‌పల్లి నుండి మాధవవరం కృష్ణారావు, శేరిలింగంపల్లి నుండి అరికెపూడి గాంధీ, సనత్‌నగర్‌ నుండి తలసాని శ్రీనివాస్ యాదవ్, నారాయణపేట నుండి రాజేందర్ రెడ్డి,కుత్బుల్లాపూర్ నుండి కెపి వివేకానందగౌడ్, జూబ్లీహిల్స్ నుండి మాగంటి గోపినాథ్‌లు టీడీపీ నుండి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత వీరంతా టీఆర్ఎస్ లో చేరారు. ఈ ఎన్నికల్లో వీరంతా టీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీ చేసి విజయం సాధించారు.