హైదరాబాద్: తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తాము ఓడిపోలేదని కాంగ్రెస్ పార్టీ నేత దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు. తాము గెలుస్తామని తెలిసే టీఆర్ఎస్ మిషన్లతో ఓడించారని ఆరోపించారు. ఒక్కో నియోజకవర్గంలో రూ.25 కోట్లు ఖర్చుపెట్టారని ఆరోపించారు. 

టీఆర్ఎస్ పార్టీ దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిందని శ్రవణ్ విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు తూట్లు పొడిచేలా టీఆర్ఎస్ పార్టీ వ్యవహరించిందని ధ్వజమెత్తారు. ప్రజలు తమవైపే ఉన్నారని కానీ ఈవీఎం మిషన్లు మాత్రం టీఆర్ఎస్ వైపు ఉన్నాయని శ్రవణ్ ఆరోపించారు. 

రాష్ట్ర ఎన్నికల కమిషన్ టీఆర్ఎస్ పార్టీకి పాలేరుగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. అకారణంగా 22 లక్షల ఓట్లు తొలగించారని తాము ఫిర్యాదు చేసినా ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ కు లై డిటెక్టర్ టెస్ట్ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. 

అలాగే వీవీ ప్యాట్లను లెక్కించాలని కోరినా సిఈవో పట్టించుకోలేదన్నారు. ప్రజలు మావైపు ఉంటే ఈవీఎం మిషన్లు మాత్రం టీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నాయన్నారు. తాము ఓడిపోలేదని తమను ప్రజలు తిరస్కరించలేదని టీఆర్ఎస్ పార్టీ దొడ్డి దారిన మిషన్లతో ఓడించిందన్నారు. 

తమకు ఈవీఎంల టాంపరింగ్ పై అనుమానం ఉందని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆరోపించారు. సాంకేతికంగా ఈవీఎంల టాంపరింగ్ కు అవకాశాలు ఉన్నాయని గతంలో కేసీఆర్ అంగీకరించారని తెలిపారు. 

ఈవీఎం టాంపరింగ్ విషయంలో కేసీఆర్ మరియు ఆయన కుటుంబ సభ్యులు తమ నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈవీఎంల టాంపరింగ్ ను సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 

కేసీఆర్ కుటుంబ సభ్యుల ట్విట్టర్, వాట్సప్, ఫోన్ కాల్స్ డేటా బయటకు తీస్తే అసలు విషయం తెలుస్తుందన్నారు. కేటీఆర్ కు లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహిస్తే క్షణాల్లో వాస్తవాలు బయటకు వస్తాయన్నారు.