కడెం ప్రాజెక్టుపై నివేదిక సిద్దం చేసిన ఢిల్లీ బృందం.. వివరాలు ఇవే..
భారీ వర్షాలు, వరదలు సంభవించిన సమయంలో నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు గేట్లు సరిగా పనిచేయపోవడంతో స్థానికుల్లో ఆందోళనలు తలెత్తుతున్న సంగతి తెలిసిందే.

భారీ వర్షాలు, వరదలు సంభవించిన సమయంలో నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు గేట్లు సరిగా పనిచేయపోవడంతో స్థానికుల్లో ఆందోళనలు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఢిల్లీ బృందం కడెం ప్రాజెక్టును పరిశీలించింది. కడెం ప్రాజెక్టు గేట్లు, ఇన్‌ఫ్లో, ఓట్ ఫ్లో సామర్థ్యాలపై నివేదిక సిద్దం చేసింది. అలాగే మొత్తం ప్రాజెక్టు స్థితిగతులపై కూడా రిపోర్టును రెడీ చేసింది. రేపు ఈఎన్సీతో ఢిల్లీ సీడబ్ల్యూసీ బృందం సమావేశం కానుంది. ఈ సమావేశం అనంతరం ప్రభుత్వానికి కడెం ప్రాజెక్టుపై సీడబ్ల్యూసీ బృందం నివేదికను అందించనుంది.
ఇక, సీడబ్ల్యూసీ బృందం వరద గేట్ల పనితీరు, ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో సామర్థ్యం, ఎడమ కాల్వ వద్ద కోతకు గురైన రోడ్డును పరిశీలించారు. గతేడాది ప్రాజెక్టుకు వచ్చిన భారీ వరదలతో దెబ్బతిన్న గేట్లు, ఆఫ్రాన్ (రక్షణ గోడ), స్పిల్‌వేలను సీడబ్ల్యూసీ బృందానికి ప్రాజెక్టు అధికారులు చూపించారు.
ఇక, ఇటీవల భారీ వర్షాలతో పెద్దఎత్తున వరద రావడంతో కడెం ప్రాజెక్టు డేంజర్ జోన్‌లో పడింది. ప్రాజెక్టుకు మొత్తంగా 18 వరద గేట్లు ఉండగా.. అందులో నాలుగు గేట్లు తెరుచుకోకుండా మెరాయించాయి. మరోవైపు ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో భారీగా పెరగడంతో దిగువన పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. గేట్లను ఎత్తేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించారు. అయితే తర్వాత వరద ఉధృతి తగ్గడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక, గతేడాది వర్షాకాంలో కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొన్న సంగతి తెలిసింది.