భూపాలపల్లి: నవమాసాలు మోసి కని పెంచిన కన్నతల్లి పట్ల ఓ కసాయి కొడుకు కర్కశంగా ప్రవర్తించాడు. వయసు మీదపడ్డ తల్లిని కంటికి రెప్పలా చూసుకోవాల్సింది పోయి చిత్రహింసలు గురిచేస్తూ నరకం చూపించాడు. కొడుకు చేసిన పనికి ఆ తల్లి కాలిని కోల్పావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషాద సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. 

పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మహదేవపూర్ మండలం సూరారం గ్రామానికి చెందిన లచ్చమ్మకు నలుగురు సంతానం. భర్త, పెద్ద కొడుకు చనిపోవడం, రెండో  కొడుకు ఇంట్లోంచి వెళ్లిపోవడం, మూడో కొడుకు పట్టించుకోకపోవంతో వయసు మీదపడ్డ ఆమె కూతురు వద్ద వుంటోంది. రెండేళ్ల క్రితం లచ్చమ్మకు ప్రమాదవశాత్తు కాలు విరగినా కొడుకు ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో కూతురే తల్లి వైద్యానికి ఖర్చు చేసింది. అయితే అచేతన స్థితిలో ఉన్న తల్లి పోషణ ఆ కూతురికి భారంగా మారడంతో సోదరుడి సాయం కోరింది. అయినప్పటికి అతడు తల్లిని ఆదరించకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. 

తల్లిని తన సోదరుడు వెంకయ్య పట్టించుకోవడం లేదని రాజ్యలక్ష్మి పోలీస్‌స్టేషన్‌తో పాటు గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేసింది. వారు అతన్ని పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చి తల్లిని పోషించాలని అప్పగించారు. అయితే ఇలా నలుగురిలో తాను అవమాన పడటానికి తల్లే కారణమని భావించిన అతడు ఆమెపై కోపాన్ని పెంచుకున్నాడు. కన్న తల్లి అన్న కనికరం లేకుండా రోజుకోరకంగా హింసించాడు.  ఈ క్రమంలోనే తల్లి కాలిని మంటల్లో కాల్చిన ఇనుప చువ్వతో కాల్చాడు. దీంతో ఇన్‌ఫెక్షన్‌ అయి ఆ తల్లి కాలిని తొలగించే పరిస్థితి ఏర్పడింది. 

దీంతో మళ్ళీ కూతురు ఆ తల్లిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తోంది. ఇలా తల్లిని చిత్రహింసలకు గురిచేసి కాలు కోల్పోడానికి కారణమైన తన సోదరుడిని కఠినంగా శిక్షించాలంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.