తెలంగాణ ఎన్నికల్లో ప్రజాకూటమి నేతలు చిత్తుగా ఓడిపోవడంతో వారు లోలోపల కుంగిపోతున్నారు. ఇక వీరి ఓటమి వల్ల మరో వర్గం కూడా కుంగిపోయారు.. వారు ఎవరో కాదు బెట్టింగ్ రాయుళ్లు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి పాలవుతుందని కోట్లలో పందాలు కాసిన వారు ఇప్పుడు నిండా మునిగిపోయారు.

తెలంగాణ ఎన్నికలపై తెలుగురాష్ట్రాల్లో భారీ స్థాయిలో బెట్టింగ్ జరిగింది. నిజానికి తెలంగాణలో కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే ఈ హడావిడి ఎక్కువగా కనిపించింది. ప్రచారం మొదలైనప్పుడు పందాలు అంతగా లేవు.. అయితే ఎగ్జిట్ పోల్స్ సర్వేలను నమ్ముకుని ఆ తర్వాత మరికొందరు బెట్టింగ్‌లోకి దిగారు.

ప్రధానంగా మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వేను గుడ్డిగా నమ్మిన కొందరు ప్రజాకూటమిపై కోట్లలో పందాలు కాశారు. తుది ఫలితాల్లో కూటమి నేతలు చిత్తుగా ఓడిపోయి టీఆర్ఎస్ ఘన విజయం సాధించడంతో కోట్లలో పందాలు కాసిన వారు నిండా మునిగిపోయారు.

అన్నంటిలోకి కూకట్‌పల్లిలో నందమూరి సుహాసినీ విజయంపైనే ఎక్కువ శాతం బెట్టింగ్ జరిగిందని తెలుస్తోంది. ప్రజాకూటమి విజయం సాధిస్తుందని.. ప్రకాశం జిల్లా కారంచేడుకు చెందిన ఓ వ్యక్తి 5 ఎకరాలు పందెం కాశాడు.

అలాగే టీఆర్ఎస్ ఓడిపోతుందని పందెం కాసిన గుంటూరు జిల్లాకు చెందిన ఓ రైతు 10 ఎకరాలు పొగొట్టుకున్నాడు. అయితే ప్రకాశం జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ రెండో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని రూ.5 కోట్లు పందెం కాసి 10 కోట్లు లాభం పొందాడు.