హైద్రాబాద్‌లో క్రికెటర్ బోగి శ్రావణి ఇంటిని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. ఈ విషయమై ఆమె తుకారాం గేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంటిని మరమ్మత్తులు చేసినా కూడా పట్టించుకోకుండా ఇంటిని కూల్చివేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

హైదరాబాద్ : హైద్రాబాద్ ‌లో క్రికెటర్ Bhogi Sravani ఇంటిని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. ఈ ఇల్లు కూలిపోయే దశలో ఉందని జీహెచ్ఎంసీ అధికారులు శ్రావణి కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చారు. అయితే ఈ ఇంటిని మరమ్మత్తులు చేసిన విషయం గుర్తించకుండానే కూల్చివేశారని క్రికెటర్ భోగి శ్రావణి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

హైద్రాబద్ Tukaram Gate పోలీస్ స్టేషన్ పరిధిలో భోగి శ్రావణి కుటుంబం నివాసం ఉంటుంది. భోగి శ్రావణి నివాసం ఉంటున్న ఇల్లు కూడా కూలిపోయే ప్రమాదం ఉందని జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల ఆధారంగా భోగి శ్రావణి కుటుంబ సభ్యులు ఇంటి వెనుక వైపు గోడను మరమ్మత్తు చేశారు. ఈ విషయాన్ని గుర్తించకుండానే జీహెచ్ ఎంసీ అధికారులు తమ ఇంటిని కూల్చివేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం నాడు సాయంత్రం తమ ఇంటి వద్దకు వచ్చి ఇంట్లోని సామానును బయటవేసి ఇంటిని కూల్చివేశారని ఆమె మీడియాకు తెలిపారు. ఈ ఇంటిని కూల్చివేయడంతో శ్రావణి తన తండ్రి Malleshతో కలిసి సమీపంలోని కమ్యూనిటీ హాల్ కు షిఫ్ట్ అయింది. ఇదే ప్రాంతంలో తాము 35 ఏళ్లుగా నివాసం ఉంటున్నట్టుగా శ్రావణి తెలిపింది. జీహెచ్ఎంసీ అధికారులు నిర్లక్ష్యంగా తమ ఇంటిని కూల్చివేసిన విషయమై తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ లో శ్రావణి ఫిర్యాదు చేసింది.

ఈనెల 15 నుంచి పుదుచ్చేరిలో జరిగే మహిళల టీ 20 టోర్నమెంట్‌లో తాను పాల్గొనాల్సి ఉందని శ్రావణి తెలిపింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను క్రికెట్ ఆడాలా? లేక తన ఇంటి కోసం పోరాడాలో తెలియట్లేదని శ్రావణి ఆవేదన చెందారు.

ఈ ఇంటి స్థలం తన తల్లికి వారి కుటుంబ సభ్యులు ఇచ్చారని క్రికెటర్ భోగి శ్రావణి చెప్పారు.అయితే ఈ స్థలానికి సంబంధించి ఆధారాలు లేవన్నారు. కానీ తాము మాత్రం ఈ ఇంటికి పన్నులు చెల్లించిన ఆదారాలున్నాయన్నారు. అయితే ఈ స్థలాన్ని ఖాళీ చేయాలని రాజేశ్వర్ గౌడ్ అనే వ్యక్తి తమను బెదిరించినట్టుగా భోగి శ్రావణి మీడియాకు తెలిపారు. రూ. 2 లక్షలు ఇస్తే ఈ స్థలాన్ని వదిలేయాలని కోరాడన్నారు. అయితే ఈ విషయమై తనకు సందీప్ అనే వ్యక్తి సహకరిస్తున్నట్టుగా చెప్పారు. స్థానికంగా ఉన్న టీఆర్ఎస్ నేతలు కూడా రాజేశ్వర్ గౌడ్ కే సహకరిస్తున్నాడన్నారు. తాను నివాసం ఉంటున్న స్థలాన్ని కూల్చివేసినందున తనకు ఈ స్థలంలో షెల్టర్ నిర్మించి ఇవ్వాలని ఆమె కోరుతున్నారు.