ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎఫెక్ట్ హుజుర్‌నగర్‌లో సీపీఐ-టీఆర్ఎస్‌ల మధ్య చీలిక తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్టీసీ జేఏసీ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీకి సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల తొలగింపు నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ వెనక్కి తీసుకోవాలని లేదంటే హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలో మద్ధతుపై పునరాలోచిస్తామని వెంకటరెడ్డి స్పష్టం చేశారు.

ప్రజా పోరాటాలు, ప్రజా సమస్యలే తమ పార్టీకి కీలకమని ఆయన పేర్కొన్నారు. హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్‌కి మద్ధతు తెలిపినప్పుడు ఆర్టీసీ సమ్మె నోటీసు మాత్రమే ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.

అయితే ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది కాదని వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు. కార్మికులకు అండగా ఉంటామని.. ఉద్యోగాలు తీసేస్తామంటే చూస్తూ ఊరుకోమని వెంకటరెడ్డి హెచ్చరించారు. కార్మికులను రోడ్డున పడేసేందుకు తెలంగాణ తెచ్చుకోలేదని చాడ గుర్తు చేశారు.