హైదరాబాద్: దేశంలో బీజేపీ హవా పడిపోయిందని ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లోనూ ఆ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చెప్పారు.

ఆదివారం నాడు ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు.  తమిళనాడులో ఎన్నికల షెడ్యూల్ కు గంట ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు ఎలా ప్రకటిస్తాయని ఆయన ప్రశ్నించారు.

ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేస్తామని ప్రధాని పేర్కొనడం సరికాదన్నారు.  ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.

సీఎం కేసీఆర్ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరు చెప్పుకొని కాయలమ్ముకొంటున్నారన్నారు. ఆయన పేరుతో గెలిచే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శలు గుప్పించారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఉనికే లేదన్నారు.

సీఎం కేసీఆర్ ను, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుతో పోల్చడం హాస్యాస్పదమన్పారు. వీరిద్దరికి నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుందన్నారు. టీఆర్ఎస్ కు ఓట్లు పడవనే కారణంగానే పీవీ పేరును తెరమీదికి తీసుకొచ్చారని ఆయన చెప్పారు.