బిగ్ బాస్ షో పై త్వరలోనే తాను హైకోర్టుకు వెళతానంటూ సీపీఐ నేత నారాయణ షాకింగ్ కామెంట్స్ చేశారు. బిగ్ బాస్ షోలో నాగార్జున మహిళలను కించ పరిచేలా మాట్లాడాడంటూ నారాయణ ఆరోపించారు. కాగా.. ఈ బిగ్ బాస్ సీజన్ 4 తొలి ఎపిసోడ్ రోజు.. అభిజిత్ తో నాగార్జున చేసిన కామెంట్స్ పై నారాయణ మండిపడ్డారు.

‘బిగ్‌బా్‌సలో అక్కినేని నాగార్జున విజేత అభిజిత్‌కు ముగ్గురు అమ్మాయిలను చూపించి ముద్దు ఎవరిని పెట్టుకోవాలనిపిస్తుంది, ఎవరితో డేటింగ్‌ చేయాలని ఉంది, పెళ్లి ఎవరిని చేసుకోవాలనిపిస్తోందో చెప్పమంటాడు. మహి ళలను కించపరిచేలా మాట్లాడాడు’ అని మండిపడ్డారు. కాగా.. సరదా కోసం దాదాపు మూడు నెలల క్రితం అడిగిన ప్రశ్నకు నారాయణ ఇప్పుడు రియాక్ట్ అవ్వడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.

ఇదిలా ఉండగా.. ఆంధ్రప్రదేశ్ లోని అధికార వైసీపీ పై కూడా నారాయణ విమర్శల వర్షం కురిపించారు.  వైసీపీ అవినీతి బరుద నుంచి పుట్టిందని, దాన్ని శుభ్రం చేసుకోవాలని హితవు పలికారు. జగన్‌ ఇంట్లో కుక్కలకు కేటాయించినంత స్థలం కూడా పేదలకు ఇవ్వక పోవడం శోచనీయమన్నారు. విభజన సందర్భంలో ప్రత్యేక హోదా, అమరావతి రాజధాని వంటి వాటికి ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇప్పుడు నోరు విప్పకపోవడం బాధాకరమన్నారు. వెంకయ్య పదవీ కాంక్ష వీడి రాష్ట్ర ప్రయోజనాలకోసం నిజాలు మాట్లాడాలని కోరారు.