కవిత చెప్పగానే కోర్టు నమ్మింది.. మోదీ ఆదేశాలు లేకుండా ఇలా జరుగుతుందా?: సీపీఐ నారాయణ
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఈడీ నోటీసులపై సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఈడీ నోటీసులపై సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కవితకు ఈడీ నోటీసులు ఇస్తే.. కోర్టు ఆమెకు వీలైనప్పుడు వెళ్లాలని చెప్పిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కవిత బిజీ అని చెప్పగానే కోర్టు నమ్మిందని అన్నారు. ప్రధాని మోదీ ఆదేశాలు లేకుండా ఇలా జరుగుతుందా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ బంధం బలంగా ఉందనడానికి ఇదే నిదర్శనమని అన్నారు.
ఇక, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు శుక్రవారం సుప్రీంకోర్టులో తాత్కాలిక ఉపశమనం లభించింది. సెప్టెంబర్ 26 వరకు సమన్లు జారీ చేయవద్దని, ఆమెపై ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని కోర్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ని ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో విచారణకు హాజరు కావాలని కవితకు మరోసారి నోటీసులు జారీ చేసింది. అయితే గతంలో ఈడీ కవితను పలుమార్లు విచారించినప్పటికీ.. కొంతమంది నిందితులు అప్రూవర్‌గా మారిన తర్వాత ఆమెను ప్రశ్నించేందుకు ఈడీ నోటీసులు పంపడం మొదటిసారి.
ఇదిలా ఉంటే, తనకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేయడంపై కవిత స్పందిస్తూ.. ఇవి మోదీ నోటీసులని, పెద్దగా పట్టించుకోనవసరం లేదని తేలికగా తీసిపారేశారు.