భారతదేశాన్ని కరోనా మహమ్మారి పట్టిపీడిస్తున్న వేళ ప్రభుత్వాలు సైతం ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలు అందించలేకపోతున్నాయి. ప్రజలు ఆక్సిజన్ దొరక్క, ఆసుపత్రుల్లో బెడ్లు అందుబాటులో లేక, ఉన్నా ఎక్కడున్నాయో తెలియక, మందుల కోసం, ప్లాస్మా కోసం నానా తంటాలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో సోషల్ మీడియా ప్లాట్ ఫారంలు వారి పాలిటి కొంగుబంగారంగా మారాయి. ఎందరో యువకులు స్వచ్చందంగా ముందుకు వచ్చి రాత్రనకా పగలనకా ప్రజలకు తమ వంతు సహాయసహకారాలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఇలా నిస్వార్థంగా సేవలందిస్తున్న యువతను గుర్తించి వారిని మీకు పరిచయం చేయడం కోసం నేటి నుండి రోజు వారీగా ఈ ఒక్కో హీరో/ షీరోలను మీ ముందుకు తీసుకువస్తున్నాము. 

అర్థరాత్రి సమయం..... ఆన్ లైన్ లోని ప్రభుత్వ పోర్టల్ లో బెడ్లు అందుబాటులో ఉన్నాయని చూసిన వ్యక్తి తన కుటుంబ సభ్యుడ్ని గాంధీ ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. కానీ అక్కడికి వెళ్లే సరికి బెడ్లు ఖాళీ లేవు. ఆన్ లైన్ లో ఖాళీ చూపెడుతుందంటూ అతడు అక్కడి అధికారులను అడగ్గా... అది కంప్యూటర్ వ్యవహారం, ఇక్కడ మాత్రం ఖాళీ లేవు అని చెప్పారు. ఈ మొత్తం ప్రహసనంలో విలువైన కీలక సమయం వృధా అవడంతో ఆ రోగి మరణించాడు. సరైన సమయంలో గనుక అతనికి ఏ ఆసుపత్రిలో బెడ్ ఖాళీ ఉందొ తెలిసి ఉంటే... సదరు వ్యక్తి కుటుంబ సభ్యుడు నేడు మన కండ్ల ముందే తిరుగుతూ ఉండేవాడు. 

ఈ సంఘటనే చరణ్ ని ఆలోచింపజేసింది. రోగులకు బెడ్లు వెంటనే అందించగలిగితే వారి ప్రాణాలను కాపాడొచ్చనే ఉద్దేశంతో మొదటగా మెహిదీపట్నం ప్రాంతంలోని ఆసుపత్రులపై ఫోకస్ పెట్టాడు. ఇంటర్నెట్ లో ఆసుపత్రి వివరాలు సేకరించి అక్కడ బెడ్లు అందుబాటులో ఉన్నాయో లేదో కనుక్కున్నాడు. కొన్ని ఆసుపత్రులకు స్వయంగా వెళ్ళాడు. అక్కడ సదరు ఇంచార్జి నెంబర్ తీసుకొని ఎప్పటికప్పుడు ఆసుపత్రిలోని బెడ్ల రియల్ టైం సమాచారాన్ని సేకరించసాగాడు. తన వద్ద ఉన్న సమాచారాన్ని నలుగురికి ఉపయోగపడడం కోసం ట్విట్టర్ ని ఆశ్రయించాడు. 

రోగుల అవసరాలకు తగ్గట్టుగా తన పరిధిలో ఆసుపత్రి బెడ్స్ ని పేషెంట్స్ కి ఇప్పించడం మొదలుపెట్టాడు. మెహిదీపట్నం ప్రాంతంతో ప్రారంభమైన సమాచార సేకరణ రోజులు గడుస్తున్నా కొద్దీ హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల సమాచారాన్ని సేకరించాడు. ఎందరో రోగులకు బెడ్స్ ని వారి అవసరానికి తగ్గట్టుగా ఎక్కడ అందుబాటులో ఉన్నాయో సమాచారాన్ని అందిస్తున్నాడు. 

ఒక సొంత ఫార్మా కంపెనీని నడుపుతున్న చరణ్.... ఈ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో తన వ్యాపారాన్ని కూడా పక్కకు పెట్టి ప్రజల కోసం ఫుల్ టైం కేటాయిస్తున్నాడు. ఏ సమయంలో అయినా అవసరం అని మెసేజ్ వచ్చినా, కాల్ వచ్చినా వెంటనే రంగంలోకి దిగి వారికి అవసరమైన సహాయాన్ని అందిస్తున్నాడు.

ప్రభుత్వ వార్ రూమ్స్ కూడా చేయలేని పనిని ఇలాంటి కొందరు యువత సోషల్ మీడియా వేదికగా... ముఖ్యంగా ట్విట్టర్ వేదికగా చేస్తున్నారు. అత్యంత వేగంగా, ఖచ్చితమైన సమాచారంతో వీరు సేవలందిస్తున్నారు. తన వల్ల ఒక్కరి మొఖంలో ఆనందం వెల్లివిరిసినా అది తనకు చాలంటున్నాడు ఈ యువకుడు.