Asianet News TeluguAsianet News Telugu

కస్టమర్లకు.. ఫ్లిప్ కార్ట్ కొరియర్ బాయ్స్ కుచ్చు టోపీ..!

జల్సాలకు అలవాటు పడిన వీరు కస్టమర్లకు వచ్చిన వస్తువులను చోరీ చేసి వాటి స్థానంలో రాళ్లు, పెంకులు పెట్టి వాపస్‌ పంపుతున్నారు. ఈ మేరకు తొమ్మిది లక్షల విలువ చేసే వస్తువులు కాజేశారు. 

Courier boys cheated customers in Karimnagar
Author
Hyderabad, First Published Aug 30, 2021, 10:27 AM IST

ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఆన్ లైన్ షాపింగ్ వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే.. ఒక్కోసారి ఆన్ లైన్ లో ఒక వస్తువు కొనుగోలు  చేస్తే.. మరో వస్తువు రావడం చాలా సార్లు చూసే ఉంటారు. అలాంటి మోసాల వెనక కొందరు కొరియర్ బాయ్స్ కుట్ర కూడా  ఉండే అవకాశం ఉందని తాజాగా సంఘటనతో వెలుగులోకి వచ్చింది.

కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండల కేంద్రంలో నలుగురు యువకులు ఫ్లిప్‌కార్ట్‌ కొరియర్‌ బాయ్స్‌గా పని చేస్తూ కస్టమర్లకు వచ్చిన వస్తువులు చోరీ చేసిన మోసం వెలుగు చూసింది. సైదాపూర్‌ మండల కేంద్రానికి చెందిన నీర్ల కళ్యాణ్‌, అనగోని వికాస్‌. కనుకుంట్ల అనిల్‌, తూటి వినయ్‌ హుజూరాబాద్‌ పట్టణంలోని లార్జ్‌ లాజిస్టిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపనీలో ఫ్లిప్‌కార్ట్‌ కొరియర్‌ బాయ్స్‌గా పని చేస్తున్నారు. జల్సాలకు అలవాటు పడిన వీరు కస్టమర్లకు వచ్చిన వస్తువులను చోరీ చేసి వాటి స్థానంలో రాళ్లు, పెంకులు పెట్టి వాపస్‌ పంపుతున్నారు. ఈ మేరకు తొమ్మిది లక్షల విలువ చేసే వస్తువులు కాజేశారు. యూట్యూబ్‌లో ఇలాంటి తరహా మోసాలు ఎలా చేయాలో గమనించారు. నిందితులు వారు డెలివరి చేసే రూట్‌లో వారి పేరుపై కొన్ని, వారి బంధువులు, స్నేహితుల పేర్లపై విలువైన వస్తువులు ఆర్డర్‌ చేసేవారు.

ఆ వస్తువులు హుజూరాబాద్‌లోని ఫ్లిప్‌కార్ట్‌ హబ్‌కు రాగానే వాటిని డెలివరీ కోసం వారి పేరుపై అసైన్‌  చేసుకొని సైదాపూర్‌కు తీసుకు వెళ్లేవారు. అక్కడ ముందుగానే అనుకున్నట్లు బుక్‌ చేసిన నంబర్‌కి ఫోన్‌  చేసేవారు. ఆ ఫోన్‌  నంబర్‌ నుంచివారి మిత్రుల ద్వారా ఆర్డర్స్‌ రిజెక్ట్‌ చేయించేవారు. కొన్నిసార్లు ఆర్డర్‌ చేసిన ఫోన్‌ నంబర్‌ని స్విచ్‌ ఆఫ్‌ పెట్టేవారు. కస్టమర్‌ నుంచి రెస్పాన్స్ లేదని తరువాత ఎవరు లేని ప్రాంతానికి వెళ్లి పార్సిల్‌ కత్తిరించేవారు. అందులో వస్తువులు తీసుకొని, అందులో మళ్లీ అంతే బరువు ఉండే రాళ్లు, పెంకులు వంటివి పెట్టి ప్యాక్‌ చేసి వాటి తిరిగి కంపెనీకి పంపేవారు. అందులో నుంచి దొంగిలించిన ఖరీదైన వస్తువులను విక్రయించగా వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవారు. హుజూరాబాద్‌ హబ్‌కి టీం లీడర్‌గా పని చేస్తున్న పట్టణానికి చెందిన ముప్పు నవీన్‌కు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల దర్యాప్తులో ఇలాంటి వస్తువులు చాలా దొంగిలించినట్లు తేలింది.

Follow Us:
Download App:
  • android
  • ios