హైదరాబాద్: నాని అనే వ్యక్తి మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఐసోలేషన్ వార్డు నుంచి తప్పించుకుని హైదరాబాదు పారిపోయి వచ్చాడు. మహారాష్ట్రలో కరోనావైరస్ వ్యాప్తి విస్తృతంగా ఉన్న విషయం తెలిసిందే. హైదరాబాదులో భీమవరం వెళ్లడానికి అతను బస్సెక్కాడు.

బస్సులో కండక్టర్ చూసి అతన్ని గుర్తు పట్టాడు. చేతికి కరోనావైరస్ స్టాంపు ఉండడంతో కండక్టర్ గుర్తుపట్టాడు. అతను ఇటీవల దుబాయ్ నుంచి ముంబైకి వచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాదులోని చింతల్ కుంట వద్ద అతను బస్సు ఎక్కాడు. చేతికి ఉన్న స్టాంపును చూసి ఆర్టీసి అధికారులు నిలదీయడంతో అతను అసలు విషయం చెప్పాడు. 

కరోనా వైరస్ రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే ముఖ్యమని ఈటెల రాజేందర్ అన్నారు. ఇటలీలోని పరిస్థితిని అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన 18 మందికి ఏ విధమైన ప్రాణాపాయం లేదని ఆయన చెప్పారు. విదేశాల నుంచి వచ్చినవారికి మాత్రమే ఆ లక్షణాలున్నాయని ఆయన చెప్పారు.

విదేశాల నుంచి వచ్చి సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుగుతున్నవారి కోసం ప్రత్యేక బృందాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. కజికిస్తాన్, దుబాయ్, ఇండోనేషియాల నుంచి వచ్చినవారిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. 

తెలంగాణలో 104 కాల్ సెంటర్ కు రద్దీ విపరీతంగా పెరిగింది. ప్రభుత్వం కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర విపత్తు నిధి నుంచి నిధులను విడుదల చేసింది. ప్రభుత్వం కరోనా కట్టడికి 116.28 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ల్యాబ్స్, ప్రత్యేక పరికరాల కోసం 33 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. క్వారంటైన్, స్క్రీనింగ్ కోసం 83.25 కోట్ల రూపాయలు విడుదల చేసింది.

సికింద్రాబాదులోని మల్లేపల్లికి చెందిన కొంత మందిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కరీంనగర్ లో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. కరీంనగర్ లో ఇంటింటికీ వెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్నారు.