హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తన కరీంగనర్ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆయన శనివారం కరీంనగగర్ వెళ్లి కరోనావైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించాలని అనుకున్నారు. అయితే, ఉన్నతాధికారులు చేసిన సూచనలతో ఆయన తన పర్యటనను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. 

కరోనా వైరస్ స్క్రీనింగ్ టెస్టులకు తన పర్యటన వల్ల ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇండోనేషియా నుంచి వచ్చిన కొంత మంది కరీంనగర్ లో అడుగు పెట్టడంతో కలకలం చెలరేగింది. దాంతో కరీంనగర్ లో అందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించనున్నారు. 

ఇండోనేషియా నుంచి వచ్చిన 12 మందిలో కరోనాపాజిటివ్ రావడంతో అందరి దృష్టి కరీంనగర్ పై పడింది. ఇప్పటికే వంద వైద్య బృందాలు కరీంనగర్ లో తనిఖీలు చేస్థున్నారని గంగుల వివరించారు. సర్వమతాలకు చెందిన మతపెద్దలతో మంత్రిసమీక్షా సమావేశం నిర్వహించారు, అన్ని ప్రార్థనామందిరాలను ఈనెల 31 వరకు దర్శించుకోవడం కుదరదని, అందుకు అన్నిమతాలకు చెందిన పెధ్ధలు ఒప్పుకున్నారని ఆయన చెప్పారు. 

వివిధ దేశాల నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 379 మంది విదేశీ పర్యటన చేసిన వారు ఉన్నట్టు ఆయన వెల్లడించారు. కరీంనగర్ టౌన్ నుంచి దాదాపు 70 మంది విదేశాలకు వెళ్లి వచ్చారని వారందరికీ ఎడమ చేతిపైన స్టాంపు వేస్తామని చెప్పారు.