లాక్ డౌన్: కేసీఆర్ మనవడు హిమాన్షు సరికొత్త దీపప్రజ్వలనం
కరోనా వైరస్ విస్తరిస్తూ లాక్ డౌన్ అమలవుతున్న ప్రస్తుత తరుణంలో తెలంగాణ సీఎం కేసీఆర్ మనవడు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
హైదరాబాద్: ప్రధాన మంత్రి మోదీ ఇచ్చిన స్ఫూర్తితో కరోనా అంతం కావాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు మనవడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు దీప ప్రజ్వలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
లాక్‌డౌన్ పూర్తయ్యే వరకు ప్రతి రోజు ఎదో ఒక పేరుతో దీపాలు వెలిగించనున్నట్టు ఆయన ప్రకటించి దాన్ని అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలి రోజు ఆదివారం కిల్ కరోనా అని, రెండో రోజు సోమవారం విన్ కరోనా అని, మూడవ రోజు లీవ్ కరోనా అని రాసి ఉన్న అక్షరాలపై హిమన్షు దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా దేశంలో కరోనా అంతం కావాలంటూ ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.
తెలంగాణలో బుధవారం సాయంత్రానికి 453 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు 11 మంది కరోనా వైరస్ సోకి మరణించారు. ఈ స్థితిలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తెలంగాణ ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగాంగానే మృతుల అంత్యక్రియలపై ఆంక్షలు పెట్టింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని నిషేధిస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
భారతదేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఐదు వేలు దాటింది. కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఉదయం 8 గంటలకు విడుదల చేసిన బులిటెన్ ప్రకారం... కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య దేశంలో 5,734కు చేరుకుంది.473 మంది కోలుకున్నారు. మరణాల సంఖ్య 166కు చేరుకుంది.