హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు వాయిదా పడనున్నాయి. పరీక్షలను యథావిధిగా కొనసాగించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తీసుకున్న నిర్ణయానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశించింది. రేపు శనివారం జరగాల్సిన పరీక్ష యధావిథంగా జరుగుతుంది. ఆ తర్వాతి పరీక్షలు వాయిదా పడనున్నాయి. తెలంగాణలో పదో తరగతి పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి.  

ఈ నెల 23వ తేదీ నుంచి జరగాల్సిన పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. శనివారం పరీక్ష జరగనుండగా, మర్నాడు 22వ తేదీ ఆదివారం సెలవు దినం. ఆ తర్వాతి పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం రీషెడ్యూల్ చేయాల్సి ఉంటుంది. ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగాల్సి ఉంది. ఈ తేదీల పరీక్షలు వాయిదా పడుతాయి. హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. దానిపై హైకోర్టు విచారణ జరిపి తీర్పు వెలువరించింది. ఈ నెల 29వ తేదీ అత్యున్నత స్థాయి సమావేశం తర్వాత పదో తరగతి పరీక్షలపై నిర్ణయం తీసుకోనున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు 16కు పెరిగాయి. విదేశాల నుంచి వచ్చి సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుగుతున్నవారి కోసం ప్రత్యేక బృందాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. కజికిస్తాన్, దుబాయ్, ఇండోనేషియాల నుంచి వచ్చినవారిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. 

తెలంగాణలో 104 కాల్ సెంటర్ కు రద్దీ విపరీతంగా పెరిగింది. ప్రభుత్వం కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర విపత్తు నిధి నుంచి నిధులను విడుదల చేసింది. ప్రభుత్వం కరోనా కట్టడికి 116.28 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ల్యాబ్స్, ప్రత్యేక పరికరాల కోసం 33 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. క్వారంటైన్, స్క్రీనింగ్ కోసం 83.25 కోట్ల రూపాయలు విడుదల చేసింది.

సికింద్రాబాదులోని మల్లేపల్లికి చెందిన కొంత మందిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కరీంనగర్ లో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. కరీంనగర్ లో ఇంటింటికీ వెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్నారు.