తెలంగాణలో కరోనా పరీక్షల ధరలు తగ్గాయి. వరుసగా రెండోసారి ధరలను సవరిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.  ల్యాబ్‌కు వెళ్లి చేసుకునే కొవిడ్‌ పరీక్షలు, ఇంటి వద్ద చేసే కరోనా పరీక్షల ధరల్లోనూ మార్పులు చేసింది.

గతంలో పరీక్షల ధరను మొదటిసారి సవరించిన రాష్ట్ర ప్రభుత్వం.. ల్యాబ్‌ల్లో చేసే ఆర్టీపీసీఆర్‌ పరీక్షకు రూ.850, ఇంటి వద్ద చేసే వాటికి రూ.1,200గా నిర్ణయించింది. తాజాగా రెండో సారి సవరణ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ల్యాబ్‌ల్లో చేసే ఆర్టీపీసీఆర్‌ పరీక్ష ధరను రూ.500, ఇంటి వద్ద చేసే కొవిడ్‌ టెస్టు ధరను రూ.750గా నిర్ణయించింది.

తెలంగాణలో ఆర్టీపీసీఆర్‌ టెస్టు కిట్లు పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉన్నందున మరోసారి కొవిడ్‌ టెస్టు ధరలను తగ్గించినట్లు ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ కరోనా కేసులు మరోసారి పెరిగాయి.

నిన్న మూడువందలకు పైగా కరోనా కేసులు నమోదు అయితే.. ఇవాళ తాజాగా 600కు పైగా పాజిటివ్ కేసులు రికార్డ్ అయ్యాయి. నిన్న రాత్రి 8గంటల వరకు 45,227 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 617 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,82,347కి చేరింది. నిన్న కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,518కి చేరింది.