Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ లో మళ్లీ కరోనా విజృంభణ.. సిటీలో కొత్తగా 2101 యాక్టివ్ కేసులు...

హైదరాబాద్ లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. సిటీలో కొత్తగా 2101 యాక్టివ్ కేసులు వెలుగు చూడడంతో కలకలం రేగింది. ఇప్పటివరకు మార్కెట్లు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోనే కనిపించిన కేసులు.. ప్రస్తుతం గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీల్లో నమోదవుతుండడంతో ఆందోళన కలిగిస్తోంది. 

corona positive cases rising again in hyderabad - bsb
Author
Hyderabad, First Published Mar 18, 2021, 9:58 AM IST

హైదరాబాద్ లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. సిటీలో కొత్తగా 2101 యాక్టివ్ కేసులు వెలుగు చూడడంతో కలకలం రేగింది. ఇప్పటివరకు మార్కెట్లు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోనే కనిపించిన కేసులు.. ప్రస్తుతం గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీల్లో నమోదవుతుండడంతో ఆందోళన కలిగిస్తోంది. 

స్కూళ్లు, కాలేజీలు తెరవడంతో గత కొద్ది రోజులుగా చాలా చోట్ల స్టూడెంట్స్, టీచర్స్ వైరస్ బారినపడుతున్నారు. రెండురోజుల కిందట బండ్లగూడ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో 38మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ణారణ కావడం కలకలం రేపింది. తాజాగా ఇప్పుడు కూకట్ పల్లిలోని ఓ ప్రైవేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో 20 విద్యార్థులతో పాటు, నాగోల్ లోని ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. 

దీంతో స్టూడెంట్స్, టీచర్స్ కుటుంబసభ్యుల్లో ఆందోళన పెరుగుతోంది. ఎలాంటి లక్షణాలు లేకపోయినా పరీక్షల్లో వైరస్ నిర్ణారణ అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దీనికి స్వీయ నియంత్రణను మరిచిపోవడమే ప్రధాన కారణం అంటున్నారు నిపుణులు. 

గతేడాది జూన్ నుంచి లాక్ డౌన్ నిబంధనలు ప్రభుత్వం క్రమంగా సడలించింది. స్కూళ్లు, కాలేజీలు తెరచుకోవడంతో పాటు హోటళ్లు, పార్కులు, ఇతర దర్శనీయ ప్రదేశాల్లోకి ప్రజలను అనుమతించారు. దీంతో జనం బైటికి రావడం బాగా పెరిగింది. ఇక వ్యాక్సిన్ సైతం ఇస్తుండడంతో ప్రజలు స్వీయ నియంత్రణను పూర్తిగా మర్చిపోయారు. సినిమాలు, విందులు, వినోదాల పేరుతో పెద్ద సంఖ్యలో గుమిగూడుతున్నారు. మాస్కులు, శానిటైజేషన్, భౌతికదూరం నిబంధనలూ మరిచిపోయారు. దీంతో వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. 

తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు 301769 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కాగా, వీటిల్లో రెండు లక్షల కేసులు గ్రేటర్‌ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే ఉన్నాయి. 

ఇప్పటివరకు చనిపోయిన 1659 మందిలో వెయ్యి మందికిపైగా నగరవాసులే కావడం గమనార్షం. ప్రస్తుతం నగరంలో 2101 యాక్టివ్‌ కేసులు ఉండగా, వీరిలో 958మంది ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రుల్లో చేరినవారిలో 60శాతం మంది వెంటిలేటర్‌పై చికిత్స పొందుతుండగా, 40 శాతం మంది సాధారణ ఆక్సిజన్‌పై చికి త్స పొందుతున్నారు. 

ప్రస్తుతం గాంధీ లో 63మంది, టిమ్స్ లో 75మంది, కింగ్ కోఠిలో 73మంది చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారంతా అపోలో, యశోద, కేర్, మెడికేర్, సన్ షైన్, కిమ్స్, ఏఐజీ లాంటి కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

అధికారికంగా ప్రకటించిన నివేదిక ప్రకారం గ్రేటర్‌ హైదరాబాద్‌లో గత వారంలో రోజుల్లో 511 కేసులు నమోదయ్యాయి. వీటిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 278, రంగారెడ్డి జిల్లాలో 104, మేడ్చల్‌ జిల్లాలో 129 కేసులు వెలుగుచూశాయి. ఇక అనధికారికంగా లెక్కిస్తే ఒక్క హైదరాబాద్‌ జిల్లా పరిధిలోనే ప్రతిరోజు 150కి పైనే కరోనా కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. 

దీనికి తోడు వైరస్ కట్టడిలో వైద్య ఆరోగ్యశాఖ వైఫల్యమవుతోంది. అనుమానంతో పీహెచ్‌సీలకు వచ్చే వారికి టెస్టులు చేసి పంపించడం తప్ప ఆతర్వాత పాలోఅప్ ఉండడం లేదు. మొదట్లో ఒకఇంట్లో ఒకరికి పాజిటివ్ వస్తే ఆ ఇంటికి వెళ్లే దారులన్నీ మూసేసి, ఇంటింటికీ తిరిగి స్క్రీనింగ్ చేసేవారు. సదరు వ్యక్తిని ప్రత్యేక అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించి చికిత్స చేసేవారు. కానీ ప్రస్తుతం ఇదెక్కడా కనిపించడంలేదు. 

పీహెచ్‌సీలకు వచ్చి పరీక్ష చేయించుకుని పాజిటివ్ తేలినా మందుబిళ్లలు చేతిలో పెట్టి పంపిస్తున్నారు. కంటైన్మెంట్‌ జోన్ల పద్ధతి పోయింది. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారి మీద నిఘా అస్సలే లేదు. 

ప్రస్తుతం సీజన్ మారడంతో దగ్గు, జ్వరం, జలుబులతో బాధపడేవారు ఎక్కువయ్యాయి. కరోనా వైరస్‌లోనూ ఇవే లక్షణాలు కన్పిస్తాయి. దీంతో ఎవరికి కరోనా ఉంది, ఎవరికి లేదు అనేది గుర్తించడం కష్టంగా మారింది. అందుకే స్వీయనియంత్రణ, స్వీయ జాగ్రత్తలు చాలా ముఖ్యమని వైద్యాధికారులు సూచిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios