హైదరాబాద్ లో పట్టపగలే దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి కన్న తండ్రినే అత్యంత దారుణంగా హత్య చేశాడు. పట్టపగలే ఇంట్లో ఒంటరిగా వున్న తండ్రిని గొంతునులిమి చంపేశాడు. 

నగరంలోని ముషీరాబాద్ ప్రాంతంలో వెంకటేశ్ అనే కానిస్టేబుల్ కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. ఇతడు చిలకలగూడ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే గత కొద్ది రోజులుగా ఇతడి మానసిక పరిస్థితి బాగోలేకపోవడంతో విధులకు సెలవు తీసుకుని ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇవాళ కుటుంబసబ్యులందరూ పనులపై బయటకు వెళ్లడంతో ఇంట్లో వెంకటేశ్ తో పాటు తండ్రి ఎల్లయ్య మాత్రమే ఉన్నాడు. 

ఒంటరిగా వున్న తండ్రి ఎల్లయ్యపై దాడిచేసిన వెంకటేశ్ తీవ్రంగా గాయపర్చాడు. అంతటితో ఆగకుండా అతడి గొంతు నులిమి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటనపై  సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు వెంకటేశ్‌ని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.