Asianet News TeluguAsianet News Telugu

గాంధీలో విధులు: రంగారెడ్డి జిల్లా కానిస్టేబుల్ కు కరోనా పాజిటివ్

రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీలోని మునగనూరు గ్రామానికి చెందిన కానిస్టేబుల్ కు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. అతను రెండు రోజుల క్రితం గాంధీ ఆస్పత్రి వద్ద విధులు నిర్వహించాడు.

Constable infected with coronavirus in Ranga Reddy district
Author
Hyderabad, First Published Apr 18, 2020, 7:54 PM IST

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ కానిస్టేబుల్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మునగనూరు గ్రామానికి చెందిన అతనికి కరోనా వైరస్ సోకింది. 

ఆయన గత రెండు రోజుల క్రితం సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రిలో విధులు నిర్వహించారు. గురువారం ఆయనకు కరోనా లక్షణాలు కనిపించడంతో 104కు సమాచారం అందించారు. వెంటనే వైద్య సిబ్బంది అక్కడికి చేరుకుని వైద్య పరీక్షలు నిర్వహించారు. అతనితో పాటు అతని కుటుంబసభ్యులను కింగ్ కోఠీలోని ఆస్పత్రికి తరలించారు. 

కానిస్టేబుల్ శాంపిల్స్ ను పరీక్షలకు పంపించారు. శుక్రవారం అందుకు సంబంధించిన నివేదిక వచ్చింది. ఆయనకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు నివేదికలో తేలింది. ఆయన కుటుంబ సభ్యుల పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. 

ఇదిలావుంటే, తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో తొలి కరోనా వైరస్ కేసు నమోదైంది. రెండు నెలల చిన్నారికి కరోనా వైరస్ సోకినట్లు నీలోఫర్ వైద్యులు నిర్ధారించారు. దీంతో చిన్నారి కుటుంబానికి చెందిన ఆరుగురిని క్వారంటైన్ కు పంపించారు. 

ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్ర రాజధాని ముషీరాబాద్ ప్రాంతంలో ఓ మిల్క్ బాత్ వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. పరీక్షల్లో అతని సోదరికి కూడా కరోనా వైరస్ సోకినట్లు తేలింది. అంతేకాకుండా వాళ్లు నివాసం ఉంటున్న ఆపార్టుమెంట్ వాచ్ మన్ ఐదేళ్ల కుమారుడికి కూడా పాజిటివ్ వచ్చింది.

దాంతో మిల్క్ బూత్ వ్యక్తికి చెందిన 16 మందిని క్వారంటైన్ కు తరలిం్చారు. దానికితోడు, ఆపార్టుమెంటులో నివాసం ఉంటున్న 40 మందిని క్వారంటైన్ కు తరలించారు. అతని వద్ద పాలు కొనుగోలు చేసిన వ్యక్తులు భయాందోళనలకు గురవుతున్నారు. 

కాగా, హైదరాబాదులోని నేరేడుమెట్ మధురానగర్ లో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అతని కుటుంబం మొత్తాన్ని అధికారులు క్వారంటైన్ కు తరలించారు. ఆ వ్యక్తి రెండు రోజుల క్రితం అన్నదానం చేయడమే కాకుండా నిత్యావసర సరుకులు పంపిణీ చేశాడు. దాంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. దాదాపు 50 మంది ఇందులో పాల్గొన్నారు.

ఇదిలావుంటే, తెలంగాణలో ఇప్పటి వరకు 766 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 18 మంది కోవిడ్ -19 వ్యాధితో మరణించారు. హైదరాబాదులో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారింది. 

Follow Us:
Download App:
  • android
  • ios