తెలంగాణ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.ప్రముఖ రాజకీయ పార్టీలన్ని ప్రచార హోరును పెంచాయి. ఈ ప్రచారంలో భాగంగా వివిధ పార్టీల కార్యకర్తల మధ్య విద్వేషాలు చెలరేగుతూ పరస్పరం దాడులు చేసుకునే స్థాయికి చేరుతున్నాయి. ఇలా నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య జరిగిన ఓ సంఘటన ఎమ్మెల్యే అభ్యర్థి తన కుటుంబంతో రోడ్డుపై నిరసనకు దిగేంత దూరం వెళ్లింది. అంతేకాకుండా తనపై ప్రత్యర్థులు అవహేళన చూస్తూ విమర్శలకు దిగుతున్నారంటూ టీఆర్ఎస్ అభ్యర్థితో పాటు అతడి కుటుంబం భావోద్వేగంతో కంటతడి పెట్టారు. 

నల్గొండ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పోటీ చేస్తుండగా టీఆర్ఎస్ తరపున కంచర్ల భూపాల్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇద్దరి మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు ఉండటంతో పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు.  కంచర్ల భూపాల్ రెడ్డి భార్య రమాదేవి కూడా తన భర్త గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు. 

ఈ క్రమంలో ఆమె ఎస్‌ఎల్‌బిసిలో ప్రచారం నిర్వహింస్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు ఎదురుపడ్డారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత చెలరేగింది. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్ ప్రచార వాహనానికున్న ప్లెక్సీలను చించేసి డ్రైవర్ పై  దాడికి దిగారు. 

ఈ దాడి గురించి తెలుసుకున్న కంచర్ల భూపాల్ రెడ్డి తన భార్య, అనుచరులు, కార్యకర్తలతో కలిసి పట్టణంలోని క్లాక్ టవర్ వద్ద నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తనపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తప్పుడు ప్రచారం చేస్తున్నరని వాపోయారు. వారు అవహేళన చేస్తున్న కామెంట్స్ తననే కాదు తన కుటుంబాన్ని ఎంతో బాధకు గురిచేస్తున్నాయని అన్నారు. ఈ క్రమంలో కంచర్ల భూపాల్ రెడ్డి, రమాదేవీలలతో అక్కడే వున్న వీరి కూతురు బావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు.