హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమి పరాభవంపై కాంగ్రెస్ పార్టీ స్టార్ కాంపైనర్ విజయశాంతి సంచనల వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు కాంగ్రెస్ పార్టీ కొంప ముంచుతుందని తాను ముందే హెచ్చరించానని అయినా పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

టీడీపీతో పొత్తు విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు మొదట తానే వ్యతిరేకించానన్న విషయాన్ని రాములమ్మ గుర్తు చేశారు. మెదక్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ లో ఉంటున్న విజయశాంతిని కలిశారు. ఈ సందర్భంగా ఎన్నికల ఫలితాలపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

టీడీపీతో పొత్తు పెట్టుకుంటే గెలిచేస్తామన్న ధీమాతో సొంత వ్యూహాన్ని పక్కన పెట్టి ఎన్నికల్లోకి వెళ్లడం వల్లే ఈ పరిస్ధితి ఉత్పన్నమైందని రాములమ్మ ఆరోపించారు. టీడీపీతో పొత్తు వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని ఆమె తప్పుబట్టారు. 

టీడీపీతో పొత్తు వల్ల జరిగిన నష్టంపై త్వరలో కాంగ్రెస్ హైకమాండ్‌కు నివేదిక ఇస్తానని చెప్పుకొచ్చారు. కనీసం పార్లమెంటు ఎన్నికల నాటికైనా ఈ తప్పులను సరిదిద్దుకోవాల్సిన అవసరం తమపై ఉందని విజయశాంతి అభిప్రాయపడ్డారు.