హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హన్మంతరావు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. 

రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. రాజగోపాల్ రెడ్డి అంతటి వ్యాఖ్యలు చేస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో స్పష్టం చేయాలని నిలదీశారు. నల్గొండ నాయకులు ఏమైనా మాట్లాడొచ్చా అంటూ విమర్శించారు. 

ఇది నల్గొండ కాంగ్రెస్సా..? లేక తెలంగాణ కాంగ్రెస్సా..? అంటూ ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డిని ఎన్నిసార్లు వదిలేస్తారని ప్రశ్నించారు. పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని నిలదీశారు. 

మాజీకేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ విషయంలో ఒకలా ప్రవర్తించిన కాంగ్రెస్ అధిష్టానం రాజగోపాల్ రెడ్డి విషయంలో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోందని ప్రశ్నించారు. సర్వేకు ఒకనీతి, రాజగోపాల్ రెడ్డికి ఒక నీతి అంటూ నిలదీశారు. రాజగోపాల్ రెడ్డిని ఏ పార్టీ అంగీకరించబోదన్నారు వీహెచ్.