హైదరాబాద్: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హన్మంతరావు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పచ్చి అవకాశవాది అంటూ విరుచుకుపడ్డారు. 

అధికారం ఎక్కడ ఉంటే కోమటిరెడ్డి బ్రదర్స్ అక్కడకు చేరిపోతారంటూ ధ్వజమెత్తారు. ఎన్నికల్లో గెలిస్తే కోమటిరెడ్డి బ్రదర్స్ గొప్ప ఓడిపోతే పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డిలే కారణమంటూ వారిపై నెట్టేస్తారంటూ విరుచుకుపడ్డారు. 

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఏం తక్కువ చేసిందో చెప్పాలని నిలదీశారు. కేవలం కాంట్రాక్ట్ పనుల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతున్నారంటూ వీహెచ్ విరుచుకుపడ్డారు. 

అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం బీజేపీ తీర్థం పుచ్చుకుంటారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో వీహెచ్ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.  

ఇకపోతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని, ఇప్పట్లో కోరుకునేది లేదంటూ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలా మంది బీజేపీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారని చెప్పుకొచ్చారు. 

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్రమోదీలాంటి ప్రజలు కోరుకుంటున్నారని, కేసీఆర్ ను ఢీ కొట్టాలంటే మోదీలాంటి సమర్ధత కలిగిన నాయకుడు అవసరమంటూ చెప్పుకొచ్చారు. 

ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర నాయకత్వం అసమర్థత వల్లే 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారంటూ చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నా నివారించడంలో విఫలమయ్యారని ధ్వజమెత్తారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దుస్థితికి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియాలే కారణమంటూ విరుచుకుపడ్డారు.