హైదరాబాద్: ఆలులేదు సూలు లేదు అల్లుడిపేరు సోమలింగంలా తయారైంది తెలంగాణలోని కాంగ్రెస్ పరిస్థితి. ఎన్నికలవ్వలేదు, రిజల్ట్స్ రాలేదు కానీ సీఎం తామ అంటే తాము అంటూ నేతలు ప్రకటించేసుకుంటున్నారు. 

ఎన్నికలు జరిగేందుకు మరో రోజు గడువు ఉంది. ఫలితాలు వెలువడేందుకు ఆరు రోజుల గడువు ఉంది. ఎన్నికలు కాలేదు, ఫలితాలు విడుదలవ్వలేదు కానీ కాంగ్రెస్ లో మాత్రం సీఎం కుర్చీపై రగడ జరుగుతోంది.   ఫలితాలు కూడా విడుదల కాలేదు.  కాకుండానే అప్పుడే కాంగ్రెస్ పార్టీలో సీఎం కుర్చీ చిచ్చు పెట్టేసింది. 

ఇదివరకే ఈ ఎన్నికల్లో గెలిస్తే తాను సీఎం అవుతానంటూ కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ ప్రకటించారు. కేసీఆర్ దళితుడిని సీఎం చేస్తానని చెయ్యలేదని అయితే ఆ కోణంలో కాంగ్రెస్ దళితులకు సీఎంగా అవకాశం ఇస్తే తనకే వస్తుందంటూ ప్రజలకు చెప్పుకొచ్చారు. తనను గెలిపించాలని కోరారు. 

ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన్ను పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ జాతీయ నేత గులాం నబీ ఆజాద్ కూడా సీఎం సీటుపై కామెంట్ చేశారు. రేవంత్ రెడ్డి సీఎం అయినా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ ప్రకటించేశారు. 

అంతేకాదు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అవుతారంటూ కాంగ్రెస్ నేత సినీనటుడు బండ్ల గణేష్ ప్రకటించారు. సీఎం కుర్చీ తనదంటే తనదేనని ఎవరికి వారే ప్రకటించుకోవడంతో మిగిలిన వాళ్లు ఊరుకుంటారా...ఊరుకోరు కదా. 

అలానే తాము సీఎం రేసులో ఉన్నామంటూ చెప్పుకొచ్చారు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్. గతంలో తనకు సీఎం పదవి నోటి దగ్గరకు వచ్చి ఆగిపోయిందని చెప్పుకొచ్చారు. ఈసారి కూటమి అధికారంలోకి వస్తే  బలహీన వర్గాలకే సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎప్పుడూ రెడ్లే ముఖ్యమంత్రులు కావాలా బలహీన వర్గాలు కాకూడదా అంటూ మండిపడ్డారు. 

రేవంత్ రెడ్డి సీఎం అవుతారని చెప్పడానికి గులాం నబీ ఆజాద్ ఎవరంటూ మండిపడ్డారు. తాను సీఎం అభ్యర్థిని అంటూ సర్వే సత్యనారాయణ ఎలా ప్రకటించుకుంటారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.