పంజాగుట్ట అంబేద్కర్ విగ్రహం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గతంలో అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చి వేసిన చోట కాంగ్రెస్ సీనియర్ నేత, వి. హనుమంతరావు మరో విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు ప్రయత్నించడంతో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు.

దీనిపై ఆయన మాట్లాడుతూ... అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ వచ్చింది. అలాంటి అంబేద్కర్‌ను ప్రభుత్వం అవమానపరుస్తోందని వీహెచ్ ధ్వజమెత్తారు.

ఆయన విగ్రహాన్ని కూల్చివేసిన తర్వాత మళ్లీ విగ్రహాన్ని ప్రతిష్టించలేదని ఆయన విమర్శించారు. ఐదు లక్షలు పెట్టి తాను అంబేద్కర్ విగ్రహాన్ని చేయించానని..  విగ్రహాన్ని ప్రతిష్టించాలని సంకల్పం ఇక్కడికి వచ్చిన వెంటనే పోలీసులు తరలించడం అన్యాయమని వి.హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు.

విగ్రహాన్ని రెండు గంటల్లో తీసుకురాకపోతే పక్కనే ఉన్న వైఎస్ విగ్రహాన్ని కూడా కూల్చేస్తామని వీహెచ్ హెచ్చరించారు. దీంతో ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమవ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వీహెచ్.... వైఎస్ విగ్రహాన్ని కూల్చేందుకు ప్రయత్నించడంతో ఆయనను బేగంపేట పోలీస్ లైన్‌కు తరలించారు.