Asianet News TeluguAsianet News Telugu

నా వల్లే వైయస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యారు: కాంగ్రెస్ నేత వీహెచ్


వైయస్ రాజశేఖర్ రెడ్డిని పీసీసీ చీఫ్ ను చేసింది తానేనని చెప్పుకొచ్చారు. పీసీసీ చీఫ్ కావడం వల్లే వైయస్ రెండుసార్లు సీఎం కాగలిగారన్నారు. ప్రస్తుతం ఆయన తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎం అయ్యారంటూ స్పష్టం చేశారు. 
 

congress senior leader v.hanmanthurao comments on ysr
Author
Hyderabad, First Published Jun 19, 2019, 4:19 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

హైదరాబాద్: దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హన్మంతరావు. వైయస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అవ్వడానికి తానే కారణమంటూ చెప్పుకొచ్చారు. 

వైయస్ రాజశేఖర్ రెడ్డిని పీసీసీ చీఫ్ ను చేసింది తానేనని చెప్పుకొచ్చారు. పీసీసీ చీఫ్ కావడం వల్లే వైయస్ రెండుసార్లు సీఎం కాగలిగారన్నారు. ప్రస్తుతం ఆయన తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎం అయ్యారంటూ స్పష్టం చేశారు. 

ఇకపోతే పంజాగుట్ట సెంటర్‌లోని దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని కూలుస్తానని తాను అనలేదని చెప్పుకొచ్చారు. వైఎస్ విగ్రహం ఉన్నప్పుడు.. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఎందుకివ్వరని మాత్రమే ప్రశ్నించానని స్పష్టం చేశారు. 

మంగళవారం ఉదయం పంజాగుట్ట చౌరస్తా వద్ద కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు, మరోసీనియర్ నేత జీవీ హర్షకుమార్ లతోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు ధర్నా చేశారు. డా.బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేశారు. 

ఈ సందర్భంగా పక్కనే ఉన్న దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. విగ్రహంపై గొలుసు వేశారు. దీంతో పోలీసులు వీహెచ్ తోపాటు కాంగ్రెస్ పార్టీ నేతలను అరెస్ట్ చేశారు.

వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని కూల్చేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు ప్రయత్నించారంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే దారుణంగా విమర్శలు గుప్పిస్తున్నారు. 

విగ్రహం కూల్చేస్తానంటూ వస్తున్న ఆరోపణలపై వీహెచ్ వివరణ ఇచ్చారు.  ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయకుండా పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. 

తాము తీసుకువచ్చిన అంబేద్కర్ విగ్రహాన్నికూడా ఎత్తుకెళ్లారని ఆరోపించారు. విగ్రహం తెచ్చిన లారీ డ్రైవర్ ఎక్కడ ఉన్నాడో కూడా తెలియడం లేదన్నారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన జరుగుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఎత్తుకెళ్లిన విగ్రహాన్ని ఇవ్వకపోతే కోర్టుకు వెళతామని వీహెచ్ హెచ్చరించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ ఏర్పాటైందన్న విషయాన్ని కేసీఆర్ మర్చిపోవద్దన్నారు. పోలీసు కేసులకు భయపడేది లేదని, పంజాగుట్ల సెంటర్లో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తీరుతానని శపథం చేశారు వీహెచ్.

Follow Us:
Download App:
  • android
  • ios