తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తాను కేటీఆర్‌ను రాజకీయ నాయకుడిగా గుర్తించనని.. కేసీఆర్ మాట్లాడితేనే తాను సమాధానం ఇస్తానన్నారు.

2014 ఎన్నికలకు ముందు మోడీ అసాధ్యమైనవి.. అవాస్తవాలైన వాగ్థానాలు చేశారని ఎద్దేవా చేశారు.. ప్రతి పౌరుడి ఖాతాలో 15 లక్షలు వేస్తానని... 15 వేలు కాదు కదా.. 15 పైసలు కూడా వేయలేదని జైపాల్ రెడ్డి విమర్శించారు. నాలుగున్నరేళ్ల పరిపాలనలో మోడికి పాజిటివ్ రికార్డు లేదని.. నెగిటివ్ రికార్డు మాత్రం ఉందన్నారు.

రాజ్యాంగ సంస్థలను ప్రధాని నిర్వీర్యం చేశారని.. ప్రపంచంలోని ఏ ఆర్ధికవేత్తలు నోట్ల రద్దును ఒప్పుకోలేదన్నారు. రాఫెల్ డీల్ విషయంలో అంబానీ కంపెనీని తాము ఎంపిక చేసుకోలేదని.. బలవంతంగా తమకు అంటగట్టారని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు బహిరంగంగానే వ్యాఖ్యానించారని జైపాల్ గుర్తు చేశారు.

ఎంతమంది చెప్పినా మోడీ నోరు విప్పరని.. అబద్ధాలు చెప్పాల్సి వస్తుందని ఆయన భయపడుతున్నారని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్‌తో బీజేపీ చాటుగా ఒప్పందం చేసుకుందని...కేసీఆర్‌కు ఓటేస్తే, మోడీకి ఓటు వేసినట్లేనని జైపాల్ రెడ్డి దుయ్యబట్టారు.

బీజేపీ బలమైన అభ్యర్థిని నిలబెడితే టీఆర్ఎస్ సాదాసీదా అభ్యర్థిని పోటీలో పెట్టిందని.. రేపు పార్లమెంట్ ఎన్నికల్లోనూ రెండు పార్టీలు ఇదే సూత్రాన్ని అమలు చేస్తాయని వ్యాఖ్యానించారు. చరిత్రలో ముందస్తుకు వెళ్లిన ఏ ముఖ్యమంత్రి గెలవలేదని.. రానున్న ఎన్నికల్లో మహాకూటమి 75 స్థానాలను కైవసం చేసుకుంటుందన్నారు.

తెలంగాణ ప్రయోజనాల కోసం రాజీపడమని.. అక్కడ చంద్రబాబున్నా, మరోకరున్నా అలాగే వ్యవహరిస్తామని జైపాల్ రెడ్డి స్పష్టం చేశారు. బీసీలకు మహాకూటమి 27 సీట్లు కేటాయిస్తే.. టీఆర్ఎస్ 22 మాత్రమే ఇచ్చిందన్నారు.

కాళేశ్వరం డిజైన్ పేరిట అంచనాను పెంచారని.. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లులేవు.. నీళ్లు ఇవ్వకుంటే ఓట్లు అడగనన్నారని జైపాల్ రెడ్డి గుర్తు చేశారు. 70 ఏళ్లలో 70 కోట్ల అప్పు చేస్తే...టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లలో లక్ష కోట్లు అప్పు చేసిందని ఆయన ఆరోపించారు. ఎన్నికల తర్వాతే మహాకూటమి సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తామని జైపాల్ రెడ్డి వెల్లడించారు.